1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 12 నవంబరు 2016 (09:36 IST)

కరెన్సీ రద్దు.. తెలంగాణపై తీవ్ర ప్రభావం.. ఆదాయానికి గండి.. గవర్నర్‌తో కేసీఆర్ ఆవేదన

పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర

పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు స్పష్టం చేశారు.

పెద్ద నోట్ల రద్దు, నిధుల లభ్యత లేకపోవడంతో ఆదాయాన్ని సమకూర్చే వ్యవస్థలన్నీ కుదేలయ్యాయని గుర్తించిన ప్రభుత్వం నష్ట నివారణ దిశగా కదిలింది. కరెన్సీ రద్దు ప్రభావం రాష్ట్ర సొంత ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావం చూపిందని, కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదని సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కరెన్సీ రద్దుతో రాష్ట్రానికి నెలకు రూ.2000 కోట్ల వరకూ నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ వివరించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైపోతుంది. రాష్ట్రంలో రోజూ 3000 రిజిస్ట్రేషన్ జరిగేవి. బుధవారం 150, గురువారం 300 మాత్రమే జరిగాయి. ఇవన్నీ గతంలో కట్టిన చలాన్లతోనే జరిగాయి. భూముల రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రభుత్వానికి రోజుకు రూ.20 కోట్లు చొప్పున నెలకు రూ.320 కోట్లు వస్తుంది. ఇది 90 శాతం పడిపోతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
నల్లధనం కట్టడి పేరుతో తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో పలుచోట్ల పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారని నివేదించారు. మహబూబాబాద్‌ జిల్లా శనిగరంలో గృహిణి ఆత్మహత్య ఘటనను కూడా సీఎం నివేదించినట్లు సమాచారం. 12 ఎకరాల భూమి అమ్ముకొని ఇంట్లో పెట్టుకున్న రూ.55 లక్షలు ఎక్కడా చెల్లుబాటు కావనే ఆందోళనతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందని గవర్నర్‌ దృష్టికి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.