మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (09:34 IST)

తెలంగాణ మంత్రులపై కేసీఆర్ అసహనం : ప్రక్షాళన దిశగా అడుగులు!

తెలంగాణ మంత్రుల తీరు పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వారి పని తీరు ఏమాత్రం బాగాలేదని ఆయన మథనపడుతున్నారు. ఇలాంటి పనితీరు వల్ల తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించడం అసాధ్యమని ఆయన భావిస్తున్నారు. అందుకే తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్న యోచనలో ఉన్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నప్పటికీ... కనీసం వారి శాఖలపై కూడా మంత్రులు అవగాహన తెచ్చుకోలేకపోయారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల పేషీలు కూడా అధ్వానంగానే ఉన్నాయని ఆయన మండిపడుతున్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్‌డీల వ్యవహారశైలిపై కేసీఆర్‌కు అనేక అభ్యంతరాలు అందుతున్నాయి. వారి చాంబర్లలో జరుగుతున్న అపసవ్య ధోరణులు కూడా కేసీఆర్ దృష్టికి వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో, కేసీఆర్ తన మంత్రి వర్గంలో భారీ ఎత్తున మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు. వచ్చే దసరా లోపల పలువురు మంత్రులకు ఉద్వాసన పలకడమో లేక శాఖలను మార్చడమో చేయవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించే పనిలో కూడా కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల పనితీరు బాగాలేకపోతే... ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని గులాబీ అధినేత భావిస్తున్నారు. ఈ క్రమంలో, ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొన్ని చేదు నిర్ణయాలు తీసుకోక తప్పదని నిర్ణయించారు. దీంతో, రానున్న రోజుల్లో తెలంగాణ మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.