సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:11 IST)

బాలింతను అడవిలోనే వదలిపెట్టేసిన 102 సిబ్బంది.. నడవలేక..?

ప్రసవానంతరం ఓ బాలింతను అడవిలోనే వదిలిపెట్టారు 102 సిబ్బంది. ఈ అమానవీయ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పెంచికల్ పేట మండలం కమ్మర్ గావ్‌లో పసికందుకు జన్మనిచ్చిన ఓ బాలింతను అడవిలో వదిలి పెట్టి 102 సిబ్బంది వెళ్ళిపోయారు. దీంతో ఆమె తన సొంత ఊరికి చేరుకోవడానికి అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ పడరాని పాట్లు పడి తన స్వగ్రామానికి చేరుకుంది.  
 
వివరాల్లోకి వెళితే కొమురం భీం జిల్లా మొర్లిగూడా గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ పొర్రెడ్డి కవితకు బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం కాగజ్ నగర్ ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. 
 
కాగజ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ అయిన కవితను ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఆసుపత్రి వర్గాలు సూచించడంతో 102 సిబ్బంది ఆమెను అంబులెన్స్‌లో ఇంటికి తరలించడానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో వారు కమ్మర్ గావ్ వరకే అంబులెన్స్ వస్తుందని, అక్కడి నుండి నడిచి వెళ్లాల్సి ఉందని తేల్చి చెప్పారు.
 
దీంతో కమ్మర్ గావ్ నుండి మూడు కిలోమీటర్ల మేర మొర్లిగూడా గ్రామానికి అడవిలో ఇబ్బందిపడుతూ నడుచుకుంటూ వెళ్లింది సదరు బాలింత. అంబులెన్స్ సిబ్బంది ఎలాంటి కనికరము లేకుండా పచ్చి బాలింత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లారని కవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.