గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (21:28 IST)

'స్టాలిన్'కు జస్ట్ సిక్స్ మినిట్స్‌లో కేటీఆర్ ఆన్సర్... ఏంటది? (video)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్‌గా మరొకరు ఉండరని చెప్పొచ్చు. ఈయన 24 గంటల పాటు సోషల్ మీడియాలో తనకు వచ్చే ట్వీట్స్‌ను పరిశీలిస్తుంటారు. అందుకే.. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా వారిని ఆదుకునేందుకు తన బృందంతో సమన్వయం చేస్తుంటారు. తాజాగా తమిళనాడు విపక్ష నేత, డీఎంకే చీఫ్ ఎంకేస్టాలిన్ ట్విట్టర్‌లో చేసిన వినతికి కేవలం ఆరు నిమిషాల్లో స్పందించి, సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్ సంభాషణ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ స్టాలిన్, కేటీఆర్‌ల మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలుసుకుందాం. 
 
డీఎంకే అధినేత స్టాలిన్ మంగళవారం ఉదయం 10.15 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు కేటీఆర్‌లకు ఓ ట్వీట్ చేశారు. "తమిళనాడుకు చెందిన పలువురు చిరు వ్యాపారులు నిజామాబాద్ జిల్లా, బాల్కొండ, కిసాన్ నగరులో చిక్కుకున్నారు. వారందరికీ ఆహారం, ఆశ్రయం లేదు. దయచేసి మీరు కల్పించుకోవాలి. వారి వివరాల కోసం తమిళనాడు స్మాల్ వెండార్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాసమురుగేశన్‌ను 7397585802 నంబరు సంప్రదించవచ్చు" అని స్టాలిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
దీనిపై కేటీఆర్ కేవలం ఆరు నిమిషాల వ్యవధిలో స్పందించారు. అంటే... స్టాలిన్ 10.15కు ట్వీట్ చేయగా, కేటీఆర్ 10.21 గంటలకు సమాధానమిస్తూ రీట్వీట్ చేశారు. "స్టాలిన్ సార్... వుయ్ విల్ టేక్ కేర్... నా టీమ్ సమన్వయం చేసుకుంటుంది" అని తెలిపారు. ఈ రెండు ట్వీట్లూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.