శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:35 IST)

సీఎం కేసీఆర్ గారూ.. నా భర్తను ఎదుర్కొనేందుకు సిద్ధమేనా? కలెక్టర్‌పై జమున ఫైర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్‌పై తెరాస మాజీ నేత, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భార్య జమున తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఒక అబద్దాలకోరుగా పోల్చారు. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని ఆరోపించారు. జమున హెచరీస్‌కు చెందిన భూములను ఈటల బలంవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె స్పష్టంచేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ భూముల అంశం కోర్టు పరిధిలో ఉండగా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ ఏ విధంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ భూముల వ్యవహారంపై మాట్లాడుతారని ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రెస్‌మీట్ పెట్టడానికే ఉన్నారా? కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? లేక తెరాస ప్రభుత్వానికి క్లర్కా? అని ఆమె మండిపడ్డారు. తమ భూముల విషయంలో అసత్య ఆరోపణలు చేస్తున్న కలెక్టరుపై కేసు పెడతామని ఆమె హెచ్చరించారు. 
 
అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఆమె గట్టిగా హెచ్చరించారు. తన భర్త ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో హుజురాబాద్‌లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని ఆమె జోస్యం చెప్పారు. రానున్న మొత్తం 33 జిల్లాల్లో తన భర్త పర్యటిస్తారని చెప్పారు. అందువల్ల ఈటలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన ఆమె పిలుపునిచ్చారు.