రఘురామ రాజును అలా ఇబ్బంది పెడుతున్న ఏపీ సీఐడీ .. లీగల్ నోటీసులు
రాజద్రోహం కేసులో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత నెల 14వ తేదీన ఆయన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజున ఆయన ఐఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇపుడు ఆ ఫోన్ నుంచి అనేక మందికి మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ సందేశాలను రిసీవ్ చేసుకున్నారిలో మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ఉన్నారు.
తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఓ మొబైల్ నంబరు నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని, ఆ నంబరు ఎంపీ రఘురామకృష్ణరాజుదని తెలిసిందని పీవీ రమేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రఘురామకృష్ణరాజు ట్విట్టర్ ఖాతాలోనే స్పందించారు.
'ఏపీ సీఐడీ పోలీసులు మే 14న నన్ను అరెస్టు చేసిన రోజున నా మొబైల్ ఫోనును అనధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ అది వారి వద్దే ఉంది. దాన్ని తిరిగి ఇచ్చేయాలని నిన్న లీగల్ నోటీసులు పంపాను. నాలుగు రోజుల క్రితం అందులోని సిమ్ కార్డును బ్లాక్ చేయించాను.. కొత్త సిమ్ కార్డు తీసుకున్నాను' అని రఘురామకృష్ణరాజు వివరించారు.
'మే 14 నుంచి జూన్ 1 వరకు నేను ఎవ్వరికీ, ఎటువంటి మెసేజ్‌లూ పంపలేదు. నిబంధనలకు విరుద్ధంగా నా మొబైల్‌ను దుర్వినియోగం చేస్తే కనుక, సునీల్ కుమార్‌తో పాటు ఇతరులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇస్తున్నాను' అని రఘురామ చెప్పారు. దీనిపై స్పందించిన పీవీ రమేశ్ స్పష్టత ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ చేశారు.