బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (14:17 IST)

వితంతు పెన్ష‌న్ క‌ట్, అలాంటివారిపై చట్టప్రకారం చర్యలు

వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల పేరు మీద చాలా మంది న‌కిలీలున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం గుర్తించింది. అందుకే వారంద‌రికీ పింఛ‌న్ క‌ట్ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఒంటరి మహిళలమంటూకు పింఛ‌ను అప్ల‌య్ చేసిన న‌కిలీల‌కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది.

లక్ష మందికి పైగా ఒంట‌రి మ‌హిళ‌లకు నోటీసులు జారీ చేసింది. వితంతువులు, ఒంటరి మహిళకు ఇచ్చే పెన్షన్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ల‌క్ష‌మంది వితంతు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లపై ప్రభుత్వం తనిఖీ చేపట్టింది. 
 
ఈ రెండు కేటగిరీల్లో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల రేషన్, ఆధార్‌ కార్డులను పరిశీలించగా, సుమారు లక్ష మందికిపైగా వివరాల్లో త‌ప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలన జరుపుతున్నారు. ఇప్పటికే 6వేల మందిని అనర్హులుగా తేల్చారు.  వీరికి జులై 1న ఇవ్వబోయే పెన్షన్ నిలిచిపోనుంది. ఇక నోటీసులు అందుకున్న లక్ష మందికిపైగా లబ్ధిదారుల్లో సరైన ధ్రువపత్రాలను సమర్పించిన వారికే జులై 1న పెన్షన్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
 
ఇప్ప‌టికే కర్నూలు జిల్లాలో 11వేల మందికి, కృష్ణాలో 14వేల మందికి, విజయనగరంలో 8వేల మందికి, చిత్తూరు జిల్లాలో 16వేల మందికి నోటీసులు జారీ చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 80వేల మందికిపైగా లబ్ధిదారుల వివరాల పరిశీలన పూర్తయింది. వీరిలో 6వేల మంది వరకు అనర్హులున్నట్లు పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) అధికారులు గుర్తించారు.

ఒంటరి మహిళ కాకున్నా చాలామంది ఆ కేటగిరీలో పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 30 వరకు తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని, అప్పటికీ పరిశీలన పూర్తికాని వారి పెన్షన్లు ఆపేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు జులై 15లోగా సరైన వివరాలు అందిస్తే రెండు నెలలది కలిపి ఒకేసారి ఆగస్టు 1న అందిస్తారు.
 
వితంతు పెన్షన్ పొందుతున్నా బియ్యం కార్డులో భర్త పేరు ఉండటం, భర్త పేరు స్థానంలో కుమారుడి పేరు నమోదై ఉండటం, ఈకేవైసీలో లింగం తప్పుగా నమోదై ఉండటం, ఒంటరి మహిళలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు అందించకపోవడం, ఇంకొన్ని చోట్ల పెన్షన్ పొందుతున్నది మహిళలు పురుషులుగా నమోదై ఉండటం, ఆధార్‌ కార్డుల్లో మార్పులు, తదితర కారణాలతో లబ్ధిదారులకు అధికారులు నోటీసులు ఇచ్చారు.

వీటికి సంబంధించి సరైన ధ్రువపత్రాలు అందించకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ నిలిపేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు. వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.