శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (21:59 IST)

లిఫ్ట్‌లు ఇంత ప్రమాదకరమా... అందులో ఇరుక్కున్న బాలుడు

నేటి కాలంలో బహుళ అంతస్తుల భవనాలు సర్వసాధారణంగా మారిపోయాయి. అపార్ట్‌మెంట్‌ల కల్చర్ పెరిగిపోతుండటంతో ఊహకందని సంఖ్యలో అంతస్తులు పెరిగిపోతున్నాయి. ఇక మనం ఖర్చు పెట్టగలిగే డబ్బును బట్టి అత్యాధునిక వసతులతో అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే చిన్నదైనా, పెద్దదైనా, ఖరీదైనదైనా, చవకైనదైనా ఆల్మోస్ట్ అన్ని అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే వీటి వలన ఎంత మంచి జరుగుతుందో అన్ని ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది.
 
మేడ్చల్‌లోని బాలాజీ నగర్ అపార్ట్‌మెంట్‌కు బాల చందర్ అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఇతని కొడుకు హేమంత్ సాయంకాలం పాఠశాల నుండి వచ్చాక ఆడుకుంటూ అటుగా వెళ్లి లిఫ్ట్ ఎక్కడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో లిఫ్ట్ గ్రిల్‌లో అతని తల ఇరుక్కుపోయి, ఊపిరి ఆడక మృతి చెందాడు. దీనిని గమనించిన హేమంత్ తల్లిదండ్రులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే హేమంత్ మృతి చెందాడు. అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా అక్కడికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.