శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (21:06 IST)

ప్రేయసి మోసం చేసిందని ఉరి... లైవ్ వీడియో చూపించిన ప్రియుడు...

అది హైదరాబాద్ లోని మైత్రీవనం. సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం వచ్చే యువతీయువకులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. సాఫ్ట్వేర్‌ టెక్కీలుగా ఉన్నతంగా ఎదగాలన్నది ప్రతి ఒక్కరి ఆలోచన. అలా ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారమే ఈ సంఘటన. విజయవాడకు చెందిన సుస్మిత, బికాం కంప్యూటర్స్ చదివి వెబ్ డిజైనింగ్ కోర్సు చేయడానికి మైత్రీవనంకు వచ్చింది. అలాగే గుంటూరుకు చెందిన  వెంకటేష్, బికాం చదివి అదే ఇనిస్టిట్యూట్లో చేరాడు. 
 
మూడునెలల్లో సాఫ్ట్వేర్ కోర్సు పూర్తి చేసి బెంగుళూరుకు వెళ్ళి సెటిలవ్వాలన్నదే అతని ఆలోచన. ఇద్దరూ ఇనిస్టిట్యూట్‌కు వచ్చారు. వెంకటేష్‌ క్లాస్‌లో చెప్పే పాఠాలు వినేదాని కన్నా సుస్మితను చూడటమే పనిగా పెట్టుకున్నాడు. మొదట్లో వెంకటేష్‌ను దూరం పెట్టిన సుస్మిత ఆ తరువాత బాగా దగ్గరయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. సుస్మిత ఒక యువకుడితో కలిసి ఉండటాన్ని గమనించిన ఆమె బంధువులు విజయవాడలో ఉన్న తండ్రికి తెలిపారు.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి సుబ్బారావు కుమార్తెకు ఫోన్ చేసి మందలించాడు. హైదరాబాద్‌లో ఉన్న తన ప్రేమ విషయం తండ్రికి ఎలా తెలిసిందో అర్థంకాక విషయాన్ని వెంకటేష్‌కి చెప్పింది. తన తండ్రి ఊరికి వచ్చెయ్యమని, పెళ్ళి చేస్తానని చెబుతున్నాడని బోరున విలపించింది. దీంతో వెంకటేష్ ఆలస్యం చేయకుండా సుస్మితను గుడికి తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి రెండు రోజుల తరువాత హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
 
కుమార్తెను బుజ్జగించాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తండ్రి అలా చెప్పడంతో తాళి బొట్టును వెంకటేష్ ముఖం మీద కొట్టి వెళ్ళిపోయింది సుస్మిత. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య దూరమైందన్న భాదతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు వెంకటేష్‌. తాను ఆత్మహత్య చేసుకోబోయేది అందరికీ తెలియాలని ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు.

ఫేస్ బుక్ లైవ్‌లో అందరూ వెంకటేష్‌ను వద్దని వారించారు. అయితే అతను వినలేదు. అలాఅలా పోలీసుల వరకు వెళ్ళింది వెంకటేష్‌ వ్యవహారం. స్థానికంగా ఉన్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న వెంకటేష్‌‌ను ప్రాణాలతో కాపాడారు. సుస్మితకు, ఆమె తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చి వెంకటేష్‌‌తో కలిపారు.