ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (13:28 IST)

భార్యతో పాటు కుమార్తె, కన్నతల్లిని చంపేశాడు.. ఉరేసుకుని ఆత్మహత్య

crime scene
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శటీ పరిధిలో ఓ దుర్మార్గుడు భార్యతో పాటు కుమార్తెను, కన్నతల్లిని చంపేశాడు. ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..  చెన్నైకి చెందిన ప్రతాప్ (34) అక్కడి ఓ కార్ల కంపెనీలో డిజైన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఈయనకు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తార్నాక ప్రాంతానికి చెందిన సింధూర (32)తో వివాహం అయ్యింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఆద్య వుంది. సింధూరకు రెండు నెలల క్రితం హిమాయత్ నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమెతో పాటు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి నగరానికి వచ్చారు. 
 
తార్నాకలోని రూపాలీ అపార్ట్మెంట్ అద్దెకు వుంటున్నారు. చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్న ప్రతాప్ వారాంతాల్లో ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు. చెన్నై వెళదామనే విషయంపై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చెన్నైలో స్థిరపడటానికి ఉద్యోగం వదలి రావాలంటూ భార్య సింధూరపై ప్రతాప్ ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదాలు, గొడవులు జరుగుతున్నాయి. 
 
చెన్నై వెళ్లే విషయమై రెండు రోజులుగా వీరి మధ్య గొడవలు జరిగి ఆదివారం రాత్రి తారాస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రతాప్ కుటుంబాన్ని హతమార్చి తానూ తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. 
 
సోమవారం నిద్రిస్తున్న భార్య, కుమార్తెను, కొద్దిసేపటి తర్వాత పక్కనే మరో బెడ్రూంలో పడుకుని వున్న తల్లిని చంపేశాడు. ఆపై ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.