1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (10:00 IST)

కుటుంబ కలహాలు - విజయవాడలో సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య

ci wife jyothi
విజయవాడ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. కుటుంబ కలహాల కారణంగా సీఐడీ విభాగంలో సీఐగా పనిచేసే ఆఫీసర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తున్నారు. ఈయన తన భార్య జ్యోతి (34)తో కలిసి విజయవాడ పటమట తోటవారి వీధిలో కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పిల్లలకు భోజనం వడ్డించే విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత చంద్రశేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన జ్యోతి... బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరేసుకుంది. 
 
ముగ్గురు కుమార్తెలు పెద్దగా అరుస్తూ తలుపులు కొట్టినప్పటికీ ఆమె తలుపులు తెరవలేదు. దీంతో పిల్లలు తమ తండ్రి చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన హుటాహుటిన వచ్చి చూడగా, అప్పటికే జ్యోతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.