శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (11:11 IST)

రూ.100 కోసం చిన్నారి ప్రాణాలు తీసిన వార్డుబాయ్... ఎక్కడ?

కేవలం వంద రూపాయల కోసం హైదరాబాద్ నగరంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఓ వార్డుబాయ్ కావడం గమనార్హం. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఇది జరిగింది. 
 
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సపొందుతున్న బాలుడికి అమర్చిన ఆక్సిజన్ పైప్‌ను డబ్బులు తీసుకుని వేరేవారికి అమర్చడంతో బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ అమానుషం హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. 
 
ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. 
 
అయితే సదరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుండటంతో భరించలేక నీలోఫర్‌లో చేర్చారు. గత మూడురోజులుగా ఖాజాను  వైద్యులు వెంటిలేటర్‌పై వుంచి వైద్యం అందిస్తూ వచ్చారు. 
 
అయితే శనివారం విధుల్లో వున్న వార్డు బాయ్ సుభాష్ కేవలం వంద రూపాయలు తీసుకుని ఖాజాకు అమర్చిన ఆక్సిజన్ పైపును తీసి పక్కనే వున్న బెడ్‌లోని బాలుడికి అమర్చాడు. దీంతో కొద్దిసేపటికే ఖాజా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
 
ఖాజా తల్లిదండ్రులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికే బాలుడు మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు వైద్య సిబ్బంది తీరుపై ఆందోళనకు దిగారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి కూడా అక్కడికి చేరుకుని వైద్యులు,వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
బాలుడి మృతికి కారణమైన వార్డు బాయ్ సుబాష్‌ను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఇలా డబ్బులకు కక్కుర్తి పడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వార్డు బాయ్‌‌లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని బాధిత కుటుంబం అంటోంది. అతడిపై పోలీస్ కేసు నమోదు చేసి శిక్షించాలని కోరుతున్నారు.