మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (11:54 IST)

నన్ను వదిలేయ్ అన్నా అంటూ దండంపెడుతున్నా... పెట్రోల్ పోసి తగులబెట్టాడు...

'అన్నా.. నన్ను వదిలేయ్... అంటూ దండం పెడుతూ' ప్రాధేయపడినా ఆ మృగాడు కనికరించలేదు కదా., తన కోర్కె తీర్చకుండా ప్రతిఘటించిందన్న అక్కసుతో అభంశుభం తెలియని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో భయపడిపోయిన ఆ కామాంధుడే మంటలు ఆర్పేశాడు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆ బాలిక శరీరం 70 శాతం మేరకు కాలిపోయింది. చేసిన పాడుపనిని కప్పిపుచ్చుకునేందుకు ఓ కట్టుకథ అల్లాడు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందని చెప్పి ఆస్పత్రిలో చేర్పించాడు. అలా ఆస్పత్రిలో పక్షం రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆ బాలిక కోలుకుని అసలు విషయం చెప్పింది. దీంతో ఆ కామాంధుడి పంటపడింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం నగరానికి సమీపమండలానికి చెందిన దంపతులకు ఆరుగురు కుమార్తెలు. కరోనా వేళ పనులు లేక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, పాఠశాలలు పనిచేయకపోవడంతో.. ఆ దంపతులు తమ 12 ఏళ్ల రెండో కుమార్తెను ఖమ్మంలోని పార్శీబంధం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పాచిపనికి కుదిర్చారు. 
 
ఆ బాలిక ఆ ఇంట్లోనే ఉంటూ పనిచేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో గత నెల 18న ఉదయం 6 గంటల సమయంలో బాలిక నిద్రిస్తుండగా ఇంటి యజమాని కుమారుడు ఎ.మారయ్య ఆమె గదిలోకి వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ హఠాత్పరిణామంతో బాలిక హడలిపోయింది. ప్రతిఘటించే యత్నం చేసింది. 'నన్ను వదిలేయ్‌ అన్నా' అంటూ వేడుకుంది. అయినా ఆ కామాంధుడు కనికరించలేదు.
 
దీంతో.. ఆ బాలిక అతణ్ని బలంగా పక్కకు నెట్టేసింది. దూరంగా పడిపోయిన మారయ్య.. ఉక్రోషంతో ఉన్మాదిలా మారాడు. ఆ బాలిక దండం పెడుతున్నా.. పట్టించుకోకుండా పెట్రోలు పోసి, నిప్పంటించాడు. తగలబడిపోతూ ఆ బాలిక చేసిన ఆర్తనాదాలకు భయపడిపోయిన మారయ్య.. తనే మంటలు ఆర్పాడు. కానీ, అప్పటికే ఆ బాలిక శరీరం 70 శాతం మేరకు కాలిపోయింది. 
 
కొనఊపిరితో ఉన్న ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ ఓ కట్టు కథ చెప్పాడు. ప్రమాదవశాత్తూ నిప్పంటుకుందని వైద్యులను నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఇదే కట్టుకథ చెప్పాడు. అయితే, ఆ బాలిక పక్షం రోజుల చికిత్స తర్వాత కొద్దిగాకోలుకోగా, జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. వారు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.