నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత గులాబీ కారెక్కారు..
ఎంపీ కవిత కారెక్కారు... ఇందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా... కారెక్కడమంటే ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు కాదు. నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా నామిషన్ వేసే కార్యక్రమంలో భాగంగా ఆమె కారును నడిపారు. గులాబి రంగు అంబాసిడర్ కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత గాని అక్కడి ఉన్న నాయకులకు అర్థం కాలేదు.. కవిత గారు కారు నడపబోతున్నారని.
గణేష్ అన్నా కారెక్కండి అనగానే గణేష్ గుప్తా ముందు సీట్లో కూర్చున్నారు. ఇంకేముంది బిగాలా ఇంటి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు గేర్ల మీద గేర్లు మార్చుకుంటూ కారు వేగం పెంచారు. వాహనదారులు సైతం ఎంపి కవిత డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు.
మీడియా ప్రత్యేక వాహనంలో ఎంపీ కవితను ఫాలో అయ్యారు. మొత్తానికి నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ అభ్యర్థిగా బీగాల గణేష్ గుప్తా చేత నామినేషన్ వేయించేందుకు కారులో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు ఎంపీ కవిత స్వయంగా తీసుకుని వెళ్ళడం పట్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది.