మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (16:01 IST)

నిజామాబాద్‌లో దారుణ హత్య... వివాహితను బ్యాగులో కుక్కి.. వాగులో?

ఓ వివాహిత నిజామాబాద్‌లో దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన కూడలి అనిత అలియాస్ అనూష గత నెల 22వ తేదీ నుంచి కనిపించలేదని భర్త రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువుల ఇళ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా అనిత జాడ కనిపించలేదు. ఈ క్రమంలో ఇసాయిపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని వాగులో చేపలో పట్టడానికి వెళ్లిన వారికి నీటి ప్రవాహంలో తేలుతూ ఒక మూట కనిపించింది. 
 
స్థానికులు దగ్గరకు వెళ్లి చూస్తే అందులో ఓ యువతి మృతదేహం కుళ్లిన స్థితిలో వుండటం చూశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన రాజశేఖర్‌ విషయం గుర్తొచ్చి.. వెంటనే అతన్ని పిలిపించారు. 
 
ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు, ఆభరణాలను బట్టి మృతురాలు తన భార్యేనని అతను గుర్తించాడు. రాజశేఖర్, అనితలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. రాజశేఖర్ తల్లిదండ్రులకు ఇష్టం లేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్, అనిత దంపతులకు ఏడాదిన్నర వయసున్న బాబు వున్నాడని పోలీసులు తెలిపారు.