గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 8 నవంబరు 2018 (20:01 IST)

చంద్రబాబూ ఎన్నాళ్లీ కుట్రలు.. హరీష్ రావు 18 ప్రశ్నలు..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో పోటీ చేస్తారని చంద్రబాబు నాయుడును హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ పోటీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలియజేశారు. బాబు తను చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదన్నారు. 
 
హైదరాబాద్‌లో హరీష్‌ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే మేకవన్నె పులి అని, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణను బలిపీఠం ఎక్కించడానికి బాబు అధికార పీఠం కోరుకోవడం రాక్షసత్వమని హరీష్ రావు  విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబుకు 18 ప్రశ్నలతో హరీష్‌ ఓ బహిరంగ లేఖ రాశారు.
 
1. నీటి పారుదల ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని  చంద్రబాబు కుట్ర చేయడం లేదా?
 
2. పాలమూరు ఎత్తిపోతల కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా?
3. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా..?
4. పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా?
 
5. కేసీ కెనాల్‌ కోసం తమ్మిళ్ల వద్దంటారా..?
 
6. కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా?
 
7. పోలవరానికి బదులు కష్ణా నీళ్లివ్వకుండా నాటకాలు ఆడడం లేదా?
 
8. శ్రీశైలం నుంచి తెలంగాణకు నీళ్లివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా?
 
9. ఎవరి అనుమతితో ఏపీ ప్రాజెక్టులు కడుతోంది?
 
10. పోలవరం ముంపు మండలాలను గుంజుకోవడం అన్యాయం కాదా?
 
11. సీలేరు విద్యుత్‌ ప్లాంట్లు తీసుకోవడం వల్ల తెలంగాణకు ఏడాదికి రూ.500 కోట్లు నష్టం చేయలేదా?
 
12. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్ని ఏకపక్షంగా రద్దు చేసి తెలంగాణకు 2465 మెగావాట్ల విద్యుత్‌ ఎగ్గొట్టలేదా?
 
13. తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్‌ ఇవ్వకపోవడం వల్ల రూ.4557 కోట్ల నష్టం కలిగించలేదా?
 
14. ఇవ్వాల్సిన కరెంట్‌ ఇవ్వకుండా కరెంట్‌ టెండర్లలో పాల్గొనడం మీ కుచ్చితత్వం కాదా?
 
15. మొత్తం1,153 మంది ఆంధ్రా విద్యుత్‌ ఉద్యోగులను ఏపీకీ తీసుకోకుండా మాపై రూ.1000 కోట్ల భారం పడడానికి మీరు కారణం కాదా?
 
16. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నా.. మాకు అప్పగించకపోవడం మీ సంకుచిత బుద్ధికి నిదర్శనం కాదా?
17. హైదరాబాద్‌ ఆస్తుల్లో వాటా కోరడం దురాశ కాదా..?
 
18. విభజన మాయని గాయం అని మీరు బాధపడలేదా?