శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (21:59 IST)

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన ప్యాసెంజర్‌ ఎమినీటీస్‌ కమిటీ (పీఏసీ)

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్యాసెంజర్‌ ఎమినీటీస్‌ కమిటీ (పీఏసీ) సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను 25 సెప్టెంబర్‌ 2021న సందర్శించింది. ఈ కమిటీ ప్రయాణీకుల వసతులను తనిఖీ చేయడంతో పాటుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద లభ్యమయ్యే ఇతర సదుపాయాలను కూడా తనిఖీ చేసింది. ఈ కమిటీలో  ఛైర్మన్‌ శ్రీ పీ.కె. కృష్ణదాస్‌ మరియు సభ్యులు ఉన్నారు.
 
ఈ కమిటీ దక్షిణ మధ్య రైల్వే మరియు ఐఆర్‌ఎస్‌డీసీ అధికారులతో సమావేశమయ్యారు. రైల్వే స్టేషన్‌లో సదుపాయాల నిర్వహణను ఐఆర్‌ఎస్‌డీసీ చూస్తుందని కమిటీకి నివేదించడం జరిగింది. ఇక్కడతో పాటుగా ఇతర స్టేషన్‌లలో కూడా ఐఆర్‌ఎస్‌డీసీ వసతులను నిర్వహిస్తుంది. దీనితో పాటుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సహా పలు రైల్వే స్టేషన్‌లను ఐఆర్‌ఎస్‌డీసీ పునః అభివృద్ధి చేస్తుంది.
 
ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ)కు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సదుపాయాల నిర్వహణ  అప్పగించడం జరిగింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సదుపాయాల పట్ల ఈ కమిటీ ప్రశంసించింది. మరీముఖ్యంగా స్టేషన్‌ ప్రవేశం వద్ద అంటే ప్లాట్‌ ఫామ్‌ నెంబర్‌ 10 వద్ద ఉన్న పచ్చదనం మరియు ఉద్యానవనాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటుగా స్టేషన్‌ వద్ద అత్యున్నత స్థాయి పరిశుభ్రతను నిర్వహించడం పట్ల ప్రశంసించింది.
 
ఈ కమిటీ పలువురు ప్రయాణీకులతో స్టేషన్‌ వద్ద ముచ్చటించింది. స్టేషన్‌లోని శుభ్రత పట్ల ప్రయాణీకులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా స్టేషన్‌ వద్ద ఉన్న సిబ్బంది పూర్తిబాధ్యతాయుతంగా, సహాయకారులుగా ఉన్నారని కమిటీతో వెల్లడించారు. ఈ కమిటీ ప్రయాణీకులకు సంబంధించి పలు వసతులను స్టేషన్‌ వద్ద తనిఖీ చేసింది. వీటిలో వెయిటింగ్‌ హాల్స్‌, టాయ్‌లెట్లు, క్యాటరింగ్‌ స్టాల్స్‌ మొదలైనవి ఉన్నాయి. టాయ్‌లెట్లలోని శుభ్రతను కమిటీ అభినందించడంతో పాటుగా స్టేషన్‌లోరి ఇతర ప్రాంతాలలోని శుభ్రతను సైతం ప్రశంసించింది.
 
స్టేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గాలి నుంచి నీరు వెండింగ్‌ కియోస్క్‌ను ఈ కమిటీ తనిఖీ చేసింది. అలాగే హెల్త్‌ కియోస్క్‌, జనరిక్‌ మెడిసన్‌ ఔట్‌లెట్‌ ‘దవాదోస్త్‌’ లను సైతం సందర్శించింది. ప్రయాణీకులకు పూర్తి ఉపయుక్తంగా ఉండే రీతిలో స్టేషన్‌ వద్ద ఐఆర్‌ఎస్‌డీసీ చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలను అభినందించింది.
 
గాలి నుంచి నీరు అందించే కియోస్క్‌, భారతీయ రైల్వే స్టేషన్‌ల చరిత్రలోనే  మొట్టమొదటిసారి అని కమిటీకి తెలియజేయడం జరిగింది. గాలిలోని తేమను స్వీకరించి, నీరుగా మార్చడంతో పాటుగా ప్రయాణీకులకు దీని ద్వారా అందించడం జరుగుతుంది. అందువల్ల, అంతర్గత వనరుల నుంచి నీరు స్టేషన్‌లో సరఫరా చేయాల్సిన అవసరం ఉండదు. దీనిని ఏదైనా రివర్శ్‌ ఓస్మోసిస్‌  (ఆర్‌ఓ) ప్రక్రియలో ఫిల్టర్‌ చేయడం జరుగుతుంది. ప్రయాణీకులకు ఎలాగైతే నీటిని సరఫరా చేస్తారో అదే రీతిలో దీనిని కూడా సరఫరా చేయవచ్చు. ఈ సేవలను పేటెంటెడ్‌ సాంకేతికతతో అందిస్తున్నారు. ఐఆర్‌ ద్వారా ప్రయాణీకులకు అందిస్తున్న వినూత్నమైన సదుపాయం ఇది.
 
స్టేషన్‌ వద్ద జనరిక్‌ ఔషదశాల ఏర్పాటుచేసి ఔషదాలను ప్రయాణీకులకు అందుబాటులో ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను కమిటీ ప్రశంసించింది. ఈ ఔషదశాలను ప్రధానమంత్రి  భారతీయ జన శుద్ధి ప్రయోజన (పీఎంబీజెపీ)ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెరిచారు. స్టేషన్‌లో ఇది మొట్టమొదటి తరహా సదుపాయం. ఇక్కడ ప్రయాణీకులు మరీముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు మరియు ఇతర ప్రయాణీకులు  ప్రయోజనం పొందుతారు. ఈ ఔట్‌లెట్‌  ఎంఆర్‌పీపై 80% వరకూ రాయితీని అందిస్తుంది. ప్రయాణీకులకు వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేకంగా డాక్టర్‌ రూమ్‌ కూడా ఇక్కడ ఉంది.
 
ఈ కమిటీ స్టేషన్‌లో ఉన్న బిర్యానీ ఔట్‌లెట్‌ ‘బిర్యానీ అడ్డా’ను సైతం తనిఖీ చేసింది. స్ధానిక హైదరాబాదీ క్యుసిన్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఇటీవలనే దీనిని ప్రారంభించారు. ఇక్కడ బ్రాండెడ్‌ బిర్యానీని ప్రయాణీకులకు అందిస్తారు. ఈ తరహాసేవలను స్టేషన్‌ వద్ద అందిస్తున్న మొట్టమొదటి తరహా ఔట్‌లెట్‌ ఇది. అంతేకాదు, హైదరాబాద్‌ తమ బిర్యానీల కోసం అత్యంత ప్రాచుర్యం పొందింది.
 
మరే ఇతర ఔట్‌లెట్‌ కూడా బ్రాండ్‌ బిర్యానీని ఈ స్టేషన్‌లో అందించడం లేదు. చక్కటి నాణ్యత కలిగిన మరియు పేరొందిన బ్రాండెడ్‌ బిర్యానీలను అందించడంలో భాగంగా బవార్చీ బ్రాండ్‌ బిర్యానీని సైతం బిర్యానీ అడ్డా వద్ద అందిస్తున్నారు.  ఈ ఔట్‌టెల్‌ నెమ్మదిగా సాధారణ ప్రయాణీకుల నడుమ ప్రాచుర్యం పొందుతుంది.
 
స్టేషన్‌ వద్ద బ్రాండెడ్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా, ఐఆర్‌ఎస్‌డీసీ ఇప్పుడు  నెస్లే కియోస్క్‌లను స్టేషన్‌ వద్ద తెరిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణీకులలో ఆత్మవిశ్వాసం  పెంపొందించడం వీలవుతుంది. ఇతర స్టేషన్‌లలో సైతం ఈ తరహా సదుపాయాలు ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడింది. దీని నిర్వహణ, స్టేషన్‌ వద్ద లభ్యమవుతున్న ఇతర సదుపాయాల పట్ల తమ సంతృప్తిని కమిటీ వ్యక్త పరిచింది.
 
ఇటీవలనే అంటే, జూన్‌ 2021లో ఐఆర్‌ఎస్‌డీసీ  ఓ అత్యవసర మరియు జనరిక్‌ ఔషద ఔట్‌లెట్‌ను సికింద్రాబాద్‌ ఔట్‌లెట్‌ వద్ద ఏర్పాటుచేసింది. ఈ ఔట్‌లెట్‌ ప్లాట్‌ఫామ్‌ 1లో జనరల్‌ వెయిటింగ్‌ హాల్‌కు దగ్గరగా ఉంది. ఇది ప్రయాణీకుల అత్యవసర వైద్య అవసరాలను తీర్చనుంది. ఐఆర్‌ఎస్‌డీసీ ఇప్పుడు కెఎస్‌ఆర్‌ బెంగళూరు, పూనె, ఆనంద్‌ విహార్‌, చండీఘడ్‌ మరియు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లలో సదుపాయాలను నిర్వహించే అవకాశం పొందింది.  ప్రయాణీకుల అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా ప్రయాణాన్ని సురక్షితంగా మరియు సౌకర్యవంతమైన అనుభవంగా మారుస్తుంది.
 
ఐఆర్‌ఎస్‌డీసీ ఇప్పుడు ప్రయాణీకుల అనుభవాలను పునర్న్విచించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా అభివృద్ధి, పునః అభివృద్ధి, నిర్వహణ పరంగా భారతదేశంలోని  పలు రైల్వే స్టేషన్‌లలో ప్రామాణికంగా నిలుపుతుంది. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ పరంగా మొట్టమొదటిసారి అనతగ్గ ఎన్నో నూతన అంశాలను ఐఆర్‌ఎస్‌డీసీ చేపట్టింది. వీటిలో గాలి నుంచి నీరు వెండింగ్‌ మెషీన్‌ ; ఫిట్‌ ఇండియా స్క్వాట్‌ కియోస్క్‌, అత్యధిక రేటింగ్‌తో ఈట్‌ రైట్‌ స్టేషన్‌, డిజిటల్‌ లాకర్‌, జనరిక్‌ మెడిసన్‌ షాప్‌, మొబైల్‌ చార్జింగ్‌ కియోస్క్‌, స్టార్టప్‌కు చెందిన ఓ రిటైల్‌ షాప్‌తో పాటుగా  ఫుడ్‌ ట్రక్‌ సైతం ఉంది.
 
త్వరలోనే, ఐఆర్‌ఎస్‌డీసీ దశల వారీగా మరో 90 స్టేషన్‌లలో సదుపాయాల కల్పనను చేపట్టనుంది. అంతేకాదు, భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టేషన్‌ల పునః అభివృద్ధికి సైతం ఐఆర్‌ఎస్‌డీసీ ప్రయత్నిస్తుంది. ప్రైవేట్‌ భాగస్వాములతో కలిసి పీపీపీ పద్ధతిలో వీటిని అభివృద్ధి చేయనుంది. ఈ ఎజెండాలో భాగంగా, 125 స్టేషన్‌లలో అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిలోనూ ఐఆర్‌ఎస్‌డీసీ ఇప్పుడు 63 స్టేషన్‌లలో పనిచేస్తుంది. ఆర్‌ఎల్‌డీఏ మరో 60 స్టేషన్‌లలో పనిచేస్తుండగా, మిగిలిన స్టేషన్‌లలో రైల్వే తన సొంతంగా కార్యక్రమాలను చేపట్టింది.  ప్రస్తుత అంచనాల ప్రకారం, 125 స్టేషన్‌ల పునః అభివృద్ధితో పాటుగా రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి 50వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది.