శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (07:43 IST)

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘అధ్యక్ష’ వేడి!

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఆ పార్టీలో వేడి రాజేస్తోంది. నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ నాలుగురోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిపినప్పటికీ ఎంపిక న్యాయబద్ధంగా జరిగే అవకాశం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ప్రయోజనాలు కాపాడాలని.. దీనికోసం సీనియర్లలంతా ఒక్కతాటిపైకి రావాలని నిర్ణయించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. 
 
పార్టీకి విశ్వసనీయంగా ఉంటూ సేవలందిస్తున్న సీనియర్లకే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని తీర్మానించి అదే విషయాన్ని వారంతా మాణికం ఠాగూర్‌కు విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి ఆయన్ను కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించారు.

పార్టీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకుండానే ఎంపీ రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు కట్టబెడితే కాంగ్రెస్‌కు తీవ్రనష్టం వాటిల్లుతుందని.. ఈ విషయాన్ని ఏఐసీసీకి నివేదించాలని ఆయా నేతలు నిర్ణయించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం దిల్లీ చేరినందున ఇరు వర్గాలు అక్కడే మకాం వేసి అధిష్ఠానం పెద్దలకు తమ వాదనలు వినిపించే అవకాశముంది.