ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (07:25 IST)

ఉపరాష్ట్రపతి వెంకయ్య మానవతా సాయం

ఫాంకొనీ అనీమియాతో బాధపడుతున్న యువతికి బోన్ మార్పిడి చికిత్స కోసం భారత గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మానవతా దృక్పథంతో స్పందించారు. ఆయన చొరవతో వైద్యానికి 18 లక్షల రూపాయలు సమకూరాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కేంద్రానికి చెందిన దివ్యశ్రీ ఎం.సి.ఏ. పూర్తి చేసింది. ఆమె తండ్రి చెంచు కుమార్ సూళ్ళూరుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె కొంత కాలంగా ఫాంకొనీ అనీమియాతో బాధపడుతోంది.

ఈ నేపథ్యంలో వెల్లూరులోని సి.ఎం.సి. ఆసుపత్రిని సంప్రదించగా ఆమెకు బోన్‌మ్యారో మార్పిడి చికిత్స చేయాలని, ఇందుకోసం 25 లక్షలు అవుతుందని వైద్యులు తెలియజేశారు. వైద్య సాయానికి ఆదుకోవాలంటూ ఆమె తండ్రి ఉపరాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు. ఈ లేఖ మీద స్పందించిన ఉపరాష్ట్రపతి బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యాన్నిచ్చారు. 

ఆ బాలిక వైద్యానికి తనవంతుగా ఉషమ్మ ద్వారా లక్ష రూపాయలు, ఉపరాష్ట్రపతి కార్యాలయం నిబంధనల మేరకు రూ.75 వేలు వెంటనే విడుదల చేయించడంతోపాటు.. ప్రధానమంత్రి సహాయనిధి (పీంఆర్ఎఫ్) నుంచి రూ. 3 లక్షలు తక్షణమే విడుదలయ్యేలా చొరవతీసుకున్నారు.

అంతే కాకుండా కుమార్తె దీపావెంకటతో మాట్లాడి స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున దివ్యశ్రీ వైద్యానికి మరో లక్ష రూపాయల సహాయం విడుదల చేయించారు. దీంతో పాటుగా కుమారుడు  హర్షవర్ధన్, కుమార్తె దీపావెంకట్ లు వ్యక్తిగతంగా చెరో లక్ష రూపాయల సహాయం అందిచేందుకు ముందుకు వచ్చారు. 

అంతే కాకుండా తమ మిత్రులతో మాట్లాడి... బి. సుబ్బారెడ్డి (వంశీరామ్ బిల్డర్స్) – 5 లక్షలు, రవి రెడ్డి సన్నారెడ్డి (శ్రీసిటీ) – 2.25 లక్షలు, సి. వెంకటేశ్వర రెడ్డి (అపర్ణ కన్ స్ట్రక్షన్స్) – 2 లక్షలు, సి.సుబ్బా రెడ్డి (సీ బ్రోస్ కనన్ స్ట్రక్షన్స్) – 1 లక్ష తదితరుల సహకారంతో మరో 10.25 లక్షల మొత్తాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆమె వైద్యానికి 18 లక్షల రూపాయలు సమకూరాయి.
 
స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్, వెల్లూరులోని వి.ఐ.టి. విద్యాసంస్థలు, శ్రీపురం లక్ష్మీ నారాయణి స్వర్ణ మందిరం వారితో మాట్లాడి యువతి వైద్యానికి సహకారం అందించమని కోరారు. తమ బిడ్డ అనారోగ్యం విషయం గురించి లేఖ రాసిన వెంటనే స్పందించి చొరవ తీసుకుని తమకు సాయం అందించిన గౌరవ ఉపరాష్ట్రపతికి దివ్యశ్రీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.