సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (11:04 IST)

రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడిన చిన్నారి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం చన్వెళ్లి గ్రామ సమీపంలో బోరుబావిలో పడిన చిన్న చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గురువారం బోరుబావిలో పడిన ఈ చిన్నారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది ఎంత

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం చన్వెళ్లి గ్రామ సమీపంలో బోరుబావిలో పడిన చిన్న చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గురువారం బోరుబావిలో పడిన ఈ చిన్నారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది ఎంతో శ్రమించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. 
 
దీనిపై తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారి బోరుబావిలో పడిన వెంటనే స్పందించి 60 గంటలకు పైగా కష్టపడ్డామని, పాపను రక్షించుకోలేకపోయామని, చిన్నారి మృతి చెందినట్లు ఆయన ప్రకటించారు. పాపను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. కాని మా శ్రమ ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
తొలుత చిన్నారిని 40 అడుగుల దగ్గర గుర్తించాం. చిన్నారి అరుపులను కుటుంబ సభ్యులు, అధికారులు విన్నారు. 180 అడుగుల దగ్గర చిన్నారి ఉందని అనుకున్నాం. అధునాతన కెమెరాలను బోరుబావిలోకి పంపించాం. 200 అడుగుల వరకు కెమెరాలను పంపించాం. చిన్నారి మరింత లోతుకు వెళ్లినట్లు గుర్తించాం. చిన్నారి 400 అడుగుల లోతులో ఊబిలో చిక్కుకోవడంతో మృతి చెందిందని తెలిపారు. 
 
చివరికి ప్లషింగ్ ప్రక్రియతో బోరుబావిలో నుంచి చిన్నారి అవయవాలు, బట్టలు బయటకు వచ్చాయి. అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ప్రకటించారు. 
 
బోరుబావిలోపడిన చిన్నారి మీనా మృతిచెందినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.  బోరుబావి నుంచి దుర్వాసన వస్తుండటంతో చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించామని మంత్రి తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని బయటికి తీసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాత్రి జరిపిన ఫ్లష్‌ఔట్‌ ద్వారా చిన్నారి మీనా ఫ్రాక్‌ బయటికి వచ్చిందని మంత్రి అన్నారు. 
 
చిన్నారి డ్రెస్‌తో పాటు అవయవాలు కూడా బోరుబావి నుంచి బయటకు రావడంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం సాయంత్రం బోరుబావిలోపడిన చిన్నారి మీనాను కాపాడేందుకు అధికారులు 60 గంటల పాటు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.