బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:57 IST)

నా భర్త పిరికోడు కాదు.. పోలీసులే చంపేశారు : రాజు భార్య ఆవేదన

తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికోడు కాదనీ, పోలీసులే అతని చంపేసి రైలు పట్టాలపై పడేసి ఉంటారని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన రాజు భార్య ఆరోపించారు. 
 
ఈ కేసులో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతూ వచ్చిన రాజు... గురువారం ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఆత్మహత్య కలకలం రేపుతోంది. దీనిపై రాజు కుటుంబ సభ్యులు స్పందించారు. రాజుది ఆత్మహత్య కాదు హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. 
 
పోలీసులే తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిందితుడు రాజు భాగ్య మౌనిక ఆరోపించింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని తెలిపింది. 
 
ఒకవేళ నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని, ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదంటూ బోరున విలిపించింది. తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మౌనిక ఆరోపించింది.
 
కాగా, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్‌ వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. మృతుడి చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అతను రాజుగా గుర్తించారు. సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత గత గురువారం(సెప్టెంబర్ 9) నుంచి పరారీలో ఉన్నాడు. 
 
మరోవైపు, నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రాంతానికి వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్ జోషి ప‌రిశీలించారు. పంచ‌నామా అనంత‌రం వ‌రంగ‌ల్ ఎంజీఎంకు రాజు డెడ్‌బాడీని త‌ర‌లించారు. అక్క‌డ పోస్టుమార్టం నిర్వ‌హించిన అనంత‌రం మృత‌దేహాన్ని అత‌న్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తామ‌ని చెప్పారు. 
 
రాజు ఆత్మహత్యను గురువారం ఉద‌యం 9:58 గంట‌ల‌కు గ్యాంగ్‌మెన్ సారంగ‌పాణి 100కు డ‌య‌ల్ చేసి చెప్పారని తెలిపారు. రాజారాం బ్రిడ్జి వ‌ద్ద రైలు కింద ప‌డి ఎవ‌రో ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెలుప‌డంతో.. ఎస్సై ర‌మేష్ బృందం అక్క‌డికి చేరుకున్నారు. డెడ్‌బాడీపై ఉన్న ప‌చ్చ‌బొట్టు, ధ‌రించిన దుస్తుల‌ను బ‌ట్టి రాజుగా నిర్ధారించారు అని సీపీ పేర్కొన్నారు. హైద‌రాబాద్ నుంచి స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు ఎలా వ‌చ్చాడో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.