తెలంగాణ ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబ సభ్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే సోదరి రాధికా రెడ్డితో పాటు.. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రలు అనుమానాస్పదంగా మృతి చెందారు.
గత 20 రోజుల క్రితం అదృశ్యమైన రాధిక కుటుంబ సభ్యలు పూర్తిగా కుళ్లిన శవాలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఆదివారం సాయంత్రం బైక్‌పై వెళుతున్న ఓ జంట ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో అధికారులు నీటిని నిలిపి వేశారు. దీంతో కారు బయటికి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి ముగ్గురిని బయటకు తీశారు. అనంతరం కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రావు సోదరి రాధిక కుటుంబ సభ్యులుగా గుర్తించారు. అయితే జనవరి 27వ తేదీన బయటకు వచ్చిన రాధిక కుటుంబం ఇప్పటివరకు కనిపించకపోయినా ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్, కలెక్టర్, సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని దెబ్బవంటిదన్నారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని తెలిపారు. అయితే గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే ఎలాంటి అనుమానం రాలేదని తెలిపారు.