శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (11:11 IST)

స్మితతో బంధానికి అడ్డు తొలగించుకోవాలని ఆమె భర్తపై సూర్యతేజ కాల్పులు

arrest
మరొకరి భార్య స్మితతో ఏర్పడిన బంధానికి అడ్డుగా ఉన్న ఆమె భర్తను భూమ్మీద లేకుండా చేయాలన్న కక్షతోనే నటుడు మనోజ్ కుమార్ అలియాస్  సూర్యతేజ ఎయిర్‌గన్నుతో కాల్పులకు తెగబడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం నాడు హైదరాబాద్ నగరంలోని శామీర్ పేటలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కాల్పులు జరిపిన సూర్యతేజను అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన సిద్ధార్థ దాస్‌(49) ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్‌కు చెందిన స్మిత గ్రంథికి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు(17), కుమార్తె(13) ఉన్నారు. ఇద్దరూ మూసాపేటలో నివాసముండేవారు. మనస్పర్థలతో 2019లో స్మిత విడాకులకు దరఖాస్తు చేశారు. 
 
ఈ నేపథ్యంలోనే తానుండే ప్రాంతానికి సిద్ధార్థ రాకుండా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవారు. ఆమె బుద్ధిజం పేరుతో మానసిక సమస్యలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేవారు. అదేసమయంలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న, విజయనగరం జిల్లా రాజాంకు చెందిన మనోజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్మితను సంప్రదించాడు. కౌన్సిలింగ్‌ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే స్మిత తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడంతో ఇద్దరూ దగ్గరయ్యారు.
 
భర్తతో వేరుగా ఉంటున్న స్మిత 2020లో ప్రశాంత్‌ అనే వ్యక్తితో కలిసి కన్సల్టెన్సీ సేవల సంస్థను ప్రారంభించారు. సంస్థ నుంచి ప్రశాంత్‌ వెళ్లిపోయాక స్మిత, మనోజ్‌ ఇద్దరూ కలిసి నిర్వహించారు. వచ్చిన లాభాలతో 2021లో శామీర్‌పేటలో సెలబ్రిటీ విల్లాలో ఇల్లుకొని అక్కడే కార్యాలయం నిర్వహిస్తూ, నివాసంగానూ ఉపయోగించేవారు. స్మిత ఇద్దరు పిల్లల చదువుల విషయంలో మనోజ్‌ కఠినంగా వ్యవహరించేవాడు. 
 
స్మిత కుమారుడు ఇంటర్‌లో ఫెయిలయ్యాడని మనోజ్‌ కొట్టాడు. దీంతో స్మిత కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల దగ్గర ఉంటున్నాడు. జులై 12న తనను మనోజ్‌ వేధిస్తున్నాడంటూ బాలల సంరక్షణ కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. తన చెల్లిల్ని కూడా వేధిస్తున్నారని తండ్రికి, సీడబ్ల్యూసీకి చెప్పాడు. ఈ క్రమంలోనే కుమార్తెను చూసేందుకు విశాఖలో ఉంటున్న సిద్ధార్థదాస్‌ శనివారం తెల్లవారుజామున శామీర్‌పేటలో స్మిత, మనోజ్‌ ఉండే నివాసానికి వెళ్లాడు. 
 
ఇదేఅదనుగా సిద్ధార్థను హతమార్చి తమ బంధానికి అడ్డుతొలగించుకోవాలని మనోజ్‌ నిర్ణయించుకున్నాడు. తనకు స్నేహితుడు బహుమతిగా ఇచ్చిన ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు. సిద్ధార్థ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అల్వాల్‌లోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి కారాగారానికి తరలించారు.