శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (16:26 IST)

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా : తెలంగాణ సర్కారు నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌(ఏబీ) పథకంలో కరోనాకు చికిత్సను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దీంతో ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఇకనుంచి ‘ఆరోగ్యశ్రీ ప్లస్ ఆయుష్మాన్‌ భారత్‌’ పేరిట ఈ పథకం అమలవుతుంది. 
 
కరోనాకు అందించే చికిత్సలను మొత్తంగా 17 రకాలుగా విభజించారు. ఇందులో ‘అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌’.. ‘పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌’.. ‘నిమోనియా’ ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం అందిస్తారు. దశలవారీగా ప్రైవేటు దవాఖానాలకు విస్తరించే అవకాశం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. 
 
రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ రాకతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1,668కి పెరిగింది. అయితే వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 50 పడకలున్న ఆసుపత్రులకు అనుమతి లభిస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ చేరికతో ఇకనుంచి 6 పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి