ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (15:34 IST)

చదువుకుంటూనే వ్యవసాయం.. కుటుంబానికి అన్నీ తానై సపర్యలు చేస్తూ...?

girl
చదువుకుంటూనే వ్యవసాయం చేస్తోంది ఓ యువతి. అంతేకాదు గొప్పలక్ష్యంతో ముందుకు సాగుతూ.. ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. రమ్యది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రుని పేట సొంతూరు. హైదరాబాద్‌ ఏవీ కాలేజీలో పీఈటీ కోర్సు చదువుతోంది. స్కూల్‌ చదివేప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండేది. 
 
ఐతే కరోనా కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్న రమ్యకు మరో కష్టం వచ్చింది. తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా కోవిడ్ బారినపడడంతో.. వాళ్లకు అన్నీ తానై సపర్యలు చేసింది. పొలం పనులు నిలిచిపోతే తానే స్వయంగా దుక్కి దున్ని.. నారుపోసి ఒంటిచేత్తో వ్యవసాయ పనులు చేస్తోంది. చదువుకు తాత్కాలికంగా బ్రేకులేసి.. పొలం పనుల్లో నిమగ్నమైంది.
 
చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటల్లోనూ రమ్య ప్రతిభ కనబరిచేది. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీల్లో అవార్డులు సాధించగా.. కొన్ని కారణాల వల్ల జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనలేక పోయింది. గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు.. జాతీయ స్థాయిలో వారిని రాణించేలా చేసేందుకే.. తాను పీఈటీ కోర్సు చేస్తున్నానని రమ్య అంటోంది.
 
కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. ఇది తనలో మరింత పట్టుదల పెంచుతోందని చెప్తోంది. గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలన్న ఆలోచనతో ఉన్న రమ్యకు.. సరైన ప్రోత్సాహం అందించాలని స్థానికులు కోరుకున్నారు. ఆమెకు చేయూత అందిస్తే.. కొత్త ప్రతిభ ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.