శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (10:36 IST)

తెలంగాణ ఆర్టీసీలో యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా ఉన్న సమయంలో ఆయన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఆయన ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా తనదైనశైలిలో విధులు నిర్వహిస్తూ, ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. 
 
ముఖ్యంగా, నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే, ఆర్టీసీ సేవలకు సంబంధించిన నగదు చెల్లింపులను ఆయన మరింత సులభతరం చేశారు. ఇందుకోసం యూపీఐ, క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా ప్రణాళికలు ఖరారు చేశారు. 
 
హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండ్లలో వివిధ సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ఆయన ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్‌లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్‌లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలను ప్రారంభించిన సమయంలో ఆర్టీసీ ఎండీ ప్రయాణికులు ఈ సర్వీసులపై తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరారు.