మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:54 IST)

వాట్సాప్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త క్యాష్‌బ్యాక్.. ఎలా?

ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ గత ఏడాదిలో పేమెంట్స్ ఫీచర్‌ను భారత్‌లో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ పేమెంట్స్ ఫీచర్‌ని యూజ్ చేసే భారతీయ యూజర్లకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు వీలుగా ఓ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ డెవలపర్లు కృషి చేస్తున్నారు.
 
వాట్సాప్ కొత్త క్యాష్‌బ్యాక్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని Wabetainfo వెల్లడించింది. దీనికి సంబంధించి వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ ఇప్పటికే ఒక స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో.. వాట్సాప్ చాట్ విండో టాప్ ప్లేస్‌లో కొత్త క్యాష్‌బ్యాక్ బ్యానర్‌ను మనం గమనించవచ్చు. "మీ తదుపరి పేమెంట్స్ పై క్యాష్‌బ్యాక్ పొందండి. ప్రారంభించడానికి బ్యానర్‌పై క్లిక్ చేయండి" అని ఆ బ్యానర్‌లో కనిపించింది. మరి మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించి మొదటి పేమెంట్ చేసే యూజర్లు మాత్రమే క్యాష్‌బ్యాక్ పొందుతారా..? లేదంటే గతంలో పేమెంట్స్ జరిపిన యూజర్లు కూడా క్యాష్‌బ్యాక్ పొందుతారా..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
 
ఈ ఫీచర్ గురించి వాట్సాప్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వినియోగించి భారతదేశంలోని యూపీఐ (UPI) పేమెంట్స్ మాత్రమే చేయగలమని యూజర్లు గమనించాలి. యూజర్లు కేవలం ఒక్కసారే క్యాష్‌బ్యాక్ పొందగలరని.. అది కూడా రూ. 10 వరకే క్యాష్‌బ్యాక్ పొందగలరని Wabetainfo నివేదిక తెలిపింది. పేమెంట్స్ చేసిన యూజర్లకు 48 గంటల్లో లభిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఫీచర్ అధికారికంగా రిలీజ్ అయిన తర్వాత క్యాష్‌బ్యాక్ అమౌంట్, క్యాష్‌బ్యాక్ పొందగలిగే సంఖ్య మారే అవకాశం ఉంది.
 
ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. అందువల్ల ఇప్పటివరకైతే.. బీటా యూజర్లు దీనిని టెస్ట్ చేయడానికి వీలుపడదు. అయితే, వాట్సాప్ స్టాండర్డ్ ఫీచర్ రిలీజ్ చేసిన తర్వాత భారతదేశంలోని వినియోగదారులు తమ పేమెంట్స్ పై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వాట్సాప్ సంస్థ ఈ ఫీచర్ గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కనుక యూజర్లు స్పష్టత కొరకు కొంత సమయం వరకు వెయిట్ చేయాల్సిందే.