సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Modified: గురువారం, 8 ఆగస్టు 2019 (17:15 IST)

కాంగ్రెస్ పార్టీకి రాములమ్మ షాక్... మోదీ సర్కారుకి జై... ఏం జరుగుతోంది?

జమ్ము-కశ్మీర్ పునర్విభజనకు గాను మోదీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఐతే ఆ పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా కశ్మీర్ పైన మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కూడా చేరిపోయారు. జమ్ము కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షాకిచ్చారు.
 
తను మాత్రమే కాదు... దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇలాగే స్పందించారంటూ చెప్పుకొచ్చారు. రాజకీయంగా విభేదాలున్నా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీ పడకూడదన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని అధిష్టానానికే రివర్స్ ఎటాక్ ఇస్తున్నారు. శత్రు దేశ కుట్రలను తిప్పి కొట్టడంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా స్పందిస్తారని సింధియా, ద్వివేదిల ద్వారా రుజువైందన్నారు.
 
ఐతే ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ సర్కారుకి మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు త్వరలో భాజపా తీర్థం పుచ్చుకునే అవకాశం వుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే విజయశాంతి స్పందించారని అనుకుంటున్నారు. మరి రాములమ్మ మనసులో వున్నదేమిటో.... ఇప్పటికైతే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా వున్నారామె.