లౌక్యం విశ్లేషణ... గోపీచంద్ అలా... బ్రహ్మానందం బకరా...
లౌక్యం తారాగణం: గోపీచంద్, రకుల్‌ప్రీత్ సింగ్, పోసాని, చంద్రమోహన్, బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, రఘుబాబు. సాంకేతిక నిపుణులు: కెమెరా: వెట్రి, సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: కోన వెంకట్, గోపీమోహన్, స్క్రీన్‌ప్లే, కోన వెంకట్, కథ: శ్రీధర్ సిపాన, దర్శకత్వం: శ్రీవాస్, నిర్మాత: ఆనంద్ ప్రసాద్.
విశ్లేషణ
ఊరిలో విలన్.. గారాల చెల్లి.. ఆమెను తన తాహతుకు ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. ఈలోగా అనాబాపతు హీరో వచ్చి జిమ్మిక్కులు చేసి ఆమెను స్వంతం చేసుకుంటాడు. ఇది ఢీ అనే సినిమా నుంచి వస్తున్నవే. మార్కెట్‌లో వచ్చిన ప్రొడెక్ట్‌ను అందరూ కొనుక్కుంటుంటే.. అదే ఫార్మెట్‌లో అటూఇటూగా మార్చేసి అమ్మేయడం అన్నమాట. ఇందులో కామన్‌గా వుండేది నవ్వించడం అనే పాయింట్. దానికి బ్రహ్మానందం ఎన్నుకోవడం. ప్రతి సినిమాలోనూ తనే హీరోతో సమానంగా కథను భుజానపై వేసుకుంటాడు. ఇలా రొటీన్ ఫార్మెట్‌లోంచి పుట్టిన చిత్రమే లౌక్యం. ఇందులో మైనస్‌లున్నా... అవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కొట్టుకుపోతాయనేది దర్శకుడి లాజిక్కు.
ఊరినే గడగడలాడించే విలన్.. ఓ కుర్రాడి చేతిలో కీలుబొమ్మగా మారిపోతాడు. ఎందుకంటే అతను హీరో కాబట్టి. తన చెల్లెలు నిశ్చితార్థం విలన్ చేస్తుంటే.. అక్కడికి పెండ్లికొడుకులా హీరో తయారయినా.. ఏ ఒక్కరూ దాని గురించి అడగకూడదు. హీరో వున్న ఇంట్లోనే విలన్‌ను తీసుకువచ్చి పెట్టినా.. చుట్టుపక్కలవారెవరూ ఇది హీరోగారి ఇల్లే అని చెప్పరు. విలన్ ఇంటిలో హీరోకు చెందిన మనుషులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నా... విలన్ చాలా కాజువల్‌గా తీసుకుంటాడు.
ఇంతకుముందు పాండవులు పాండవులు తుమ్మెదలా.. విలన్ ఇంటికి హీరో స్నేహితులు ఐదుగురు వస్తారు. రకరకాల కారణాలతో.. ఇలా ఢీ చిత్రం నుంచి ప్రతి సినిమాల్లోనూ హీరో ఆడే డ్రామాకు బకరా అయిన బ్రహ్మానందం తెలిసినా చెప్పకపోవడం, చెప్పినా విలన్లు సరిగ్గా వినిపించుకోకపోవడం.. వంటివి మాస్ ప్రేక్షకుడికి ఎంజాయ్ చేయడానికే అనే లాజిక్కు దర్శక నిర్మాతలకు తెలుసు గనుక లాగించేస్తున్నారు.
మొదటిభాగం సరదాగా సాగుతుంది. రెండో భాగంలో కాస్త ట్విస్ట్‌లకు, ఛేజ్‌లు, పరుగులతో ఎంటర్‌టైన్ చేయిస్తూ... లాగించాడు. ప్రతి సన్నివేశాన్ని హీరో ఎలా తప్పించుకున్నాడనేది హీరో తెలివితేటలపై ఆధారపడి వుంటుంది. దాన్ని రచయితలు.. అప్పటికప్పుడు వండేసి.. వార్చేస్తారు. దాంతో హమ్మయ్య ఈ గండం గట్టెక్కిందని హీరో భావించినట్లు ప్రేక్షకుడు భావించాలి. ఇలా భావించినంతకాలం సినిమాలు ఇలాగే వస్తుంటాయి. ప్రేక్షకులు ఇలాగే చూస్తుంటారు.