Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?
ఖమ్మం, వేంసూరు మండలం దుద్దిపూడి గ్రామంలో 25 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆన్‌లైన్ లోన్ యాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అతనిపై వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో హోటల్ నడుపుతున్న ముత్యాల హరీష్, యాప్ ద్వారా రూ. 5,411 అప్పు తీసుకున్నాడు. రుణం పొందిన పది రోజుల తర్వాత, కంపెనీ ప్రతినిధులు వడ్డీ, ఇతర ఛార్జీలతో సహా రూ. 9,000 తిరిగి చెల్లించాలని అతనిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారని ఆరోపించారు. వెంటనే చెల్లింపు చేయలేకపోవడంతో హరీష్ మరింత వేధింపులకు గురయ్యాడు.
కంపెనీ నిర్వాహకులు అతని ఫోటోలను మార్ఫింగ్ చేసి, అతని బంధువులకు అశ్లీల, నగ్న చిత్రాలను బంధువులకు షేర్ చేసి, అతన్ని అవమానించే ప్రయత్నం చేశారు. వేధింపులతో కలత చెందిన హరీష్ శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి మరణించాడు. అతని తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.