1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 జులై 2025 (08:36 IST)

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

crime
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వానికే మచ్చతెచ్చే సంఘటన ఇది. దత్తత తీసుకున్న బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డారు. దత్తత పేరుతో ఆ బాలికను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామానికి చెందిన ముల్లంగి నాగుల్ మీరాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె (17)ను దత్తత తీసుకునేందుకు కేశినేని రమేశ్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. దత్తత పేరుతో ఆ బాలికను తీసుకువెళ్లిన రమేశ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
 
ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి నాగుల్ మీరా విస్సన్నపేట పోలీస్ స్టేషనులో రమేశ్‌పై ఫిర్యాదు చేసింది. అబార్షన్ విషయం బయటపడటంతో బాలికను తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తర్వాత రమేశ్ ఇంటికి వచ్చి బాలికను బలవంతంగా ఖమ్మం నగరానికి తీసుకువెళ్లాడు. ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం.
 
తమ కుమార్తెను తమకు అప్పగించాలని తల్లి నాగుల్ మీరా డిమాండ్ చేశారు. బాలికను ఇంటి నుండి కిడ్నాప్ చేసిన రమేశ్ రెండు రోజులు తన వద్ద ఉంచుకుని, ఆ తర్వాత కానిస్టేబుల్ కృష్ణతో కలిసి పంపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కారులో తన కుమార్తెను తరలిస్తుండగా, తల్లి నాగుల్ మీరా కారును ఆపి నిలదీసింది. ఈ వ్యవహారంపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి విచారణ జరుపుతున్నారు.