కోలీవుడ్‌లో బొమ్మాళీకి ఛాన్సులే.. ఛాన్సులు..!
టాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసి అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న యోగా టీచర్, బొమ్మాళీ అనుష్కకు కోలీవుడ్‌లో మంచి ఛాన్సులు వస్తున్నాయట. "ఇరండు" (తెలుగులో రెండు) చిత్రం ద్వారా కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన అనుష్కకు.. "అరుంధతి" (తమిళ డబ్బింగ్) ద్వారా మంచి గుర్తింపు లభించింది.
ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు మేమేనని విర్రవీగుతోన్న నయనతార, త్రిష, శ్రేయలకు అనుష్క కోలీవుడ్ ప్రవేశం షాక్ ఇచ్చిందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. తమిళంలో పెద్ద హీరో నుంచి యంగ్ హీరో వరకు నటించే అవకాశాలు ఎక్కువ శాతం నయనతారకే వస్తుండేవి. ఈమెకు తర్వాత తెల్లపిల్ల హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా ఆ ఛాన్సులను కొట్టేసింది. అయితే ఈ తెల్లపిల్లకు కూడా ఈ మధ్య ఛాన్సులు అంతగా రావట్లేదని తెలిసింది. అసలు కారణమేమిటని ఆరాతీస్తే..? అనుష్క వెంట కోలీవుడ్ నిర్మాతలు కాల్షీట్ కోసం పడిగాపులు కాస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్" అనే చిత్రంలో నటించిన అనుష్క.. ఇందులో డాక్టర్ పాత్రను పోషిస్తోంది.
అంతేగాకుండా.. ఎక్స్‌పోజింగ్, గ్లామర్‌కు పెద్దపీట వేసి కోలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ వారంలోనే తెరపైకి రానుంది. అరుంధతితోనే బొమ్మాళీకి కోలీవుడ్ మహిళా అభిమానులు ఎక్కువైన నేపథ్యంలో.. వేట్టైక్కారన్ చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా పాటలకే మాస్ ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ వచ్చిందని, తప్పకుండా అనుష్క నటించే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని కోలీవుడ్ సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.
ఇంకా.. అనుష్కకు కోలీవుడ్ ప్రేక్షకులు, సినీ వాతావరణం ఎంతో నచ్చేసిందని సన్నిహితులతో కూడా చెప్పిందట. ఇంకేముంది..? కోలీవుడ్‌లోనూ అనుష్క తన హవాను కొనసాగించడం ఖాయమన్నమాట..!