శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (19:38 IST)

తల్లి పాత్రలకు అంగీకరిస్తే ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టా? రాశి ప్రశ్న (video)

సినిమాల్లో నటించేందుకు తల్లి పాత్రలు అంగీకరించినంత మాత్రాన తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టు ప్రచారం చేయడం ఏమాత్రం తగదని సీనియర్ నటి రాశి అన్నారు. ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దని ఆమె కోరారు. పైగా, తాను తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నట్టు తెలిపారు. 
 
కాగా, సినీ నటి రాశి ఆర్థిక కష్టాల్లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినీ అవకాశాలు లేక బాధ పడుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. గతంలో ఈమె ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇంటిని కూడా విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సినీ నటి రాశి స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆమె తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ, తన గురించి జరుగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు. తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టంచేశారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పారు. సమస్యలు ఎవరికైనా వస్తుంటాయని... వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. 
 
కాగా, తెలుగు చిత్ర పరిశ్రమలోకి బాలనటిగా అడుగుపెట్టిన రాశి... ఆ తర్వాత అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగారు. అన్ని రకాల పాత్రలను పోషించి అభిమానుల మన్ననలు పొందారు. చివరకు వ్యాంప్ క్యారెక్టర్‌లో సైతం నటించి మెప్పించారు. 
 
పెళ్లి చేసుకుని ఫ్యామిలీకి పరిమితమైపోయిన రాశి ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. తల్లి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడం వల్లే ఆమె తల్లిపాత్రలకు సమ్మతిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.