అమెరికా స్టాక్ మార్కెట్ల లాభాలు.. ఫేస్‌బుక్, అమేజాన్ అదుర్స్
కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేసిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్ నిచ్చింది. దీనికితోడు జీడీపీ వేగంగా పుంజుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ స్పష్టం చేయడంతో సెంటిమెంటు బలపడింది.
అలాగే టెక్నాలజీ దిగ్గజాలు జోరు చూపడంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు మరోసారి లాభపడ్డాయి. డోజోన్స్ 1.5 శాతం(369 పాయింట్లు) పుంజుకుని 24,576 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 1.7 శాతం(49 పాయింట్లు) పెరిగి 2,972 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్ మరింత అధికంగా 2 శాతం(191 పాయింట్లు) ఎగసి 9,376 వద్ద స్థిరపడింది. దీంతో గత ఐదు రోజుల్లో నాలుగు రోజులపాటు ఇండెక్సులు లాభాలతో ముగిసినట్లయ్యింది.
బుధవారం టెక్ దిగ్గజాలు అల్ఫాబెట్, అమేజాన్, ఫేస్‌బుక్ షేర్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 6 శాతం జంప్‌చేసి 230 డాలర్లను తాకింది, ఈకామర్స్ దిగ్గజం అమేజాన్ 2 శాతం ఎగసి 2498 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా ఈ రెండు కౌంటర్లూ కొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా కస్టమర్లు ప్రొడక్టులను విక్రయించేందుకు ఫేస్‌బుక్ షాప్స్ పేరుతో వీలు కల్పించనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం తాజాగా పేర్కొంది.