మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (19:22 IST)

2018 టాలీవుడ్ రౌండప్ : వెండితెరకు పరిచయమైన హీరోలు

తెలుగు సినీ చరిత్రలో మరో సంవత్సరం కలిసిపోనుంది. 2018 సంవత్సరంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక మంది పాతతరం నటులు కన్నుమూస్తే, కొందరు కొత్త హీరోలు వెండితెరకు పరిచయమయ్యారు. అలా 2018లో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోల, వారు నటించిన తొలి సినిమా సక్సెస్ తదితర వివరాలను తెలుసుకుందాం. 
 
కార్తికేయ... 
'ఆర్ఎక్స్-100' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో కార్తికేయ. ఈ కుర్రోడు వెండితెరకు పరిచయం అవుతూనే సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నటించిన ఒకే ఒక చిత్రంతో హాట్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఈ ఒక్క ప్రాజెక్టుతోనే పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
 
రాహుల్ విజయ్... 
2018లో తెలుగుతెరకు పరిచయమైన మరో హీరో రాహుల్ విజయ్. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు. "ఈ మాయ పేరేమిటో" సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ప్రేమ, హాస్యం, కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ సాధించడమేకాకుండా, రాహుల్ విజయ్‌ నటనకు మంచి మార్కులు కూడా వచ్చాయి. ప్రస్తుతం నీహారిక కొణెదెలతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.
 
కళ్యాణ్ దేవ్...
మెగా కాంపౌండ్ నుంచి తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో. మెగాస్టార్ చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ భర్త. చిరంజీవి అల్లుడు హోదాలో వెండితెరకు పరిచయమయ్యాడు. చిరంజీవి నటించిన "విజేత" చిత్రం టైటిల్‌తోనే తొలి చిత్రాన్ని తీశాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డాన్స్‌లో కూడా మెగా కాంపౌండ్ హీరో అనిపించుకున్నాడు.
 
రక్షిత్... 
'లండన్ బాబులు' చిత్రంతో పరిచయమైన హీరో రక్షిత్. ఈ చిత్రంలో ఈ కుర్ర హీరో నటనకు మంచి మార్కులు కూడా వచ్చాయి. స్వాతి వంటి కో-స్టార్, మారుతి వంటి వ్యక్తి నిర్మాతగా ఉండటంతో రక్షిత్ వైపు టాలీవుడ్ దృష్టిసారించింది.
 
యష్... 
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మరో హీరో యష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'కేజీఎఫ్' సినిమాతో ఈ నటుడు తెలుగు వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ మూవీలో యష్ లుక్స్, టాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకర్షించాయి. కన్నడనాట ఇప్పటికే రాకింగ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ నటుడు, 'కేజీఎఫ్' తర్వాత తన సినిమాలను రెగ్యులర్‌గా తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
 
సుమంత్ శైలేంద్ర... 
ప్రముఖ దర్శకుడు మారుతి అందించిన కథతో 'బ్రాండ్ బాబు' అనే చిత్రం ద్వారా పరిచయమైన హీరో సుమంత్ శైలేంద్ర. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, పూజిత, మురళీ శర్మ, రాజా రవీంద్ర వంటి స్టార్స్ నటించగా, ఈ చిత్రం సుమంత్ శైలేంద్రకు టాలీవుడ్‌లో మంచి ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసింది.
 
మోహన్ భగత్... 
2018లో వచ్చిన చిత్రాల్లో ఎక్కువ ప్రశంసలు అందుకున్న చిత్రం మూవీ "కేరాఫ్ కంచరపాలెం". ఈ సినిమాతో మోహన్ భగత్, కార్తీక్ అనే ఇద్దరు నటులు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. సినిమాలో వీళ్లిద్దరి యాక్టింగ్ అందరికీ బాగా నచ్చింది. కొత్త యేడాదిలో మరిన్ని కొత్త ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నారు. 
 
అభినవ్...
'హుషారు' అనే చిన్న చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అభినవ్. ఈ చిత్రంలో నలుగురిలో ఒకడిగా ఉన్నప్పటికీ తన యాక్టింగ్ టైమింగ్‌తో ప్రతి ఒక్కరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది.
 
ధనంజయ్... 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పించిన 'భైరవగీత' చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరో ధనంజయ్. ఈ సంవత్సరాఖరులో వచ్చారు. నిజానికి ఈయనకు 10 చిత్రాలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ... టాలీవుడ్‌లో మాత్రం ఇదే డెబ్యూ మూవీ.