నిర్మాత బన్నీ వాసు మోసం చేశాడంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తాను ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్దకు వచ్చిన సునీత బోయ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
మలక్ పేట ప్రాంతంలో కొంత కాలంగా పుచ్చకాయలు విక్రయిస్తున్న సునీత బోయకు గతంలో సినీ పరిశ్రమతో కొంత సంబంధాలు ఉండేవి. బన్నీ వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ మోసం చేశాడని ఆమె చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు, ఆయన సంబంధీకులు ఇప్పటికే నాలుగు సార్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు.
రెండుసార్లు ఎర్రగడ్డలోని ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. తాజాగా వారం కిందట ఆమె మరో వీడియో పోస్టు చేశారు. బన్నీ వాసు బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆ వీడియోలో ఆమె పోస్టు చేశారు.
ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకు వచ్చిన సునీత బోయను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యాలయం మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. అలాగే ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక చికిత్సాలయానికి తరలించాలని జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయమూర్తిని కోరారు.