శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (17:57 IST)

ఆర్యకు క్లీన్ చిట్.. నిర్దోషి అని తేలిపోయింది..

ఓ యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తమిళ హీరో ఆర్య పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులో ఆర్యకు నిర్దోషి అని తేలింది. అసలు ఆ కేసులకు అతనికి సంబంధం లేదని తేలింది. ఆర్య పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించిన అసలు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
 
పూర్తి వివరాల్లోకెళ్తే.. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీ నుంచి ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఆర్యతో చేసిన చాటింగ్‌ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్‌ ఫొటోలు కూడా విడుదల చేసింది. 
 
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నెలో కమిషనర్‌ ఎదుట ఆర్య ఆగస్టు 10వ తేదీన విచారణకు హాజరయ్యాడు. విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలింది.
 
అనంతరం చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్‌ ఆర్మాన్‌, మహ్మద్‌ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్‌ క్రియేట్‌ చేశారని.. ఆ వాట్సప్‌ ద్వారా శ్రీలంక యువతి విద్జాతో చాటింగ్‌ చేసి డబ్బులు దండుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నటుడు ఆర్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. 
 
తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయపరిచాయని తెలిపాడు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని చెప్పాడు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.