శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (17:03 IST)

డ్రగ్స్ దందాలో కన్నడ హీరోయిన్.. ఖాకీల డెడ్‌లైన్!!

అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం మొదలైంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణలో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజరుకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) రంగంలోకి దిగింది. అలాగే, తెలుగులో కూడా పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయనీ, పెద్ద పెద్ద ప్రముఖులు జరుపుకునే పార్టీలో డ్రగ్స్ వాడకం ఉన్నట్టు సినీ నటి, బీజేపీ మహిళా నేత మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇంతలోనే కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన హీరోయిన్ రాగిణి ద్వివేదికి డ్రగ్స్‌ ముఠాతో లింకులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో గురువారం రాత్రిలోగా తమ ఎదుట హాజరుకవాలంటూ బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీచేశారు. ఈ వ్యవహారం ఇపుడు శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. 
 
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే రాగిణి స్నేహితుడు రవిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో రాగిణికి కూడా సంబంధాలు ఉన్నట్టు రవి విచారణలో సంకేతాలు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆమెకు సమన్లు జారీ అయ్యాయి.
 
ఇదిలావుంటే, కన్నడ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గత నెల 20న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు నటీనటులు, మోడల్స్ పేర్లు ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు ప్రముఖుల వెన్నులో వణుకు మొదలైంది.