బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (07:50 IST)

సుశాంత్ కేసు : సీబీఐ సమన్లతో ముంబై పోలీసుల వెన్నులో వణుకు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు సీబీఐ మంగళవారం సమన్లు జారీచేసింది. సుశాంత్‌ కేసును దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిలో ఒకరైన భూషణ్ బెల్నేకర్‌కు, బాంద్రా పోలీస్ స్టేషన్ ఎస్ఐకి సీబీఐ సమన్లు పంపింది. 
 
ఇప్పటివరకూ సుశాంత్ కేసులో ముంబై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేశారని మహారాష్ట్ర సీఎంతో సహా ఆ రాష్ట్ర మంత్రులు, శరద్ పవార్ కూడా చెప్పిన నేపథ్యంలో ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది.
 
అంతేకాకుండా, ఈ కేసును సీబీఐకు అప్పగించడాన్ని కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు.. పలువురు అధికార రాజకీయ పార్టీ నేతలు కూడా విమర్శించారు. కానీ, ఇపుడు ఇద్దరు పోలీసులకు సీబీఐ సమన్లు పంపడంతో ఈ కేసులో ఏదో గుట్టు దాగివుందనే విషయం తెలుస్తోంది. 
 
నిజానికి ముంబై పోలీసులు కేసు నుంచి సుశాంత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తిని ఉద్దేశపూర్వకంగా తప్పిస్తున్నారంటూ గతంలో కొన్ని వాదనలు కూడా తెరపైకొచ్చాయి. ఇప్పటికే సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన బాంద్రా పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన ఆధారలన్నింటినీ సీబీఐ ఇప్పటికే సేకరించింది.