గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (08:55 IST)

'ఏందిరబ్బీ' అంటూ కడుపుబ్బ నవ్వించిన జేపీ మృతి - సినీలైఫ్ ఇచ్చిన దాసరి

నటుడు జయప్రకాష్ రెడ్డి అంటే.. కేవరం భారీ కాయమే కాదు... ఏందిరబ్బీ అంటూ తనకే సొంతమైన అదో రకమైన మ్యానరిజంతో తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుడు. అంతే... కరుడుగట్టిన విలనిజాన్ని చూపించిన ప్రతినాయకుడు. విలన్ పాత్రలతో పాటు.. హాస్య పాత్రలు ధరించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటుడు. ఆయన మంగళవారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. 
 
బాత్రూమ్‌కెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపు... ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, కరోన వైరస్ లాక్డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో ఆయన కొన్ని నెలలుగా గుంటూరులోని తన నివాసంలోనే ఉంటూవచ్చారు.
 
జేపీది సొంతూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. 1949, మే 8న ఆయన సిరువెల్ల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే ఆయనకు బాగా ఆసక్తి. దీంతో ఆయన స్వగ్రామం నుంచి గుంటూరుకు వచ్చారు. నల్గొండ జిల్లాలో 'గప్‌చుప్‌' అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా.. ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావుకు జేపీ నటన నచ్చి సినీరంగానికి పరిచయం చేశారు. 1998లో విడుదలైన "బ్రహ్మపుత్రుడు" సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 1997లో విడుదలైన 'ప్రేమించుకుందాం రా' సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.
 
అనంతరం 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' తదితర చిత్రాలతో తన విలనిజంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. రాయలసీమ యాసలో ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా తనదైన ముద్రవేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్‌ విధించిన నాటిన నుంచి ఆయన గుంటూరు విద్యానగర్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలో సుమారు వంద సినిమాలకుపైగా నటించారు. 
 
"ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్షా, రేసుగుర్రం, మనం, రెడీ, పటాస్, టెంపర్‌, సరైనోడు" వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి, విలనిజాన్ని ప్రదర్శించడంతో పాటు కామెడీని పండించారు. ఆయన చివరిసారిగా మహేశ్‌బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు"లో నటించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సంతాపం ప్రకటించారు.