బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (08:51 IST)

అమ్మా.. మీ బిడ్డలను తిరిగి తీసుకురాలేను.. నేనే ఒక బిడ్డగా నిలుస్తా : పవన్

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజును పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ... తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. 
 
పవన్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో 25 అడుగుల ఎత్తున బ్యానర్ క‌ట్టేందుకు పవన్ అభిమానులు ప్రయత్నం చేశారు. అయితే బ్యాన‌ర్ క‌ట్టే క్ర‌మంలో విద్యుత్ వైర్లు తగ‌ల‌డంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురికాగా, ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. మృతులను సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.
 
క‌రెంట్ షాక్‌తో మృతి చెందిన త‌న అభిమానుల వార్త త‌న‌ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశించారు. 
 
జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాను. క్షతగాత్రులు ముగ్గురూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాను అంటూ పవ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.