శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:50 IST)

ప్రణబ్ ముఖర్జీ ఎలా మరణించారంటే...

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10వ తేదీ నుంచి ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆరోగ్యం విషమించి మృతి చెందారు. అయితే, ఆయన కరోనా వైరస్ కారణంగా చనిపోయారనీ, మెదడుకు సర్జరీ చేయడం వల్ల చనిపోయారనీ, ఇలా పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. దీంతో సైనిక ఆస్పత్రి వైద్య వర్గాలు ప్రణబ్ మృతిపై ఓ ప్రకటన చేశాయి. ప్రణబ్‌ ముఖర్జీ సెప్టిక్‌  షాక్‌తో మరణించినట్లు వైద్యులు తెలిపారు. 
 
అసలు సెప్టిక్‌ షాక్‌ అంటే ఏమిటంటే.. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు.. వాటిపై పోరాటంలో భాగంగా శరీరం రక్తంలోకి కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఆ రసాయనాల మోతాదు పెరిగిపోయినప్పుడు రక్తం విషపూరితమైపోతుంది. ఈ స్థితిని సెప్సిస్‌ అంటారు. అది తీవ్ర సెప్సిస్‌కు, అంతిమంగా సెప్టిక్‌ షాక్‌కు దారి తీస్తుంది. ఆ దశలో.. రక్తపోటు ప్రమాదకరస్థాయులకు పడిపోతుంది. శరీరంలోని పలు కీలక అవయవాలకు ఆక్సిజన్‌ అందక అవి దెబ్బతింటాయి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ పనిచేయడం మానేస్తాయి. చివరకు మరణిస్తారు. ప్రణబ్ ముఖర్జీ విషయంలో ఇదే జరిగింది. 
 
దేశంలో ఏడు రోజులు సంతాప దినాలు.. 
ఇకపోతే, దేశానికి ఆయన అందించిన సేవలకు నివాళిగా కేంద్రం ఏడు రోజులు (ఆగస్టు 31-సెప్టెంబరు 6) సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ ఏడు రోజుల్లో అధికారికంగా ఎలాంటి వినోద కార్యక్రమాలూ ఉండబోవని తెలిపింది. 
 
ప్రణబ్ ప్రస్థానం ఇదీ.. 
ప్రణబ్‌ ముఖర్జీ (1935-2020)
పూర్తి పేరు : ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ
పుట్టిన తేదీ : డిసెంబరు 11, 1935 
స్వగ్రామం : మిరాటి, బీర్‌భం జిల్లా, బెంగాల్‌ 
తల్లిదండ్రులు : రాజ్‌లక్ష్మి, కమద కింకర్‌ ముఖర్జీ
విద్యాభ్యాసం : ఎంఏ, ఎల్‌ఎల్‌బీ  
తొలి ఉద్యోగం : లెక్చరర్‌ 
(రాజనీతి శాస్త్రం) - 1963 
రాజ్యసభలో తొలి అడుగు : 1969 
దేశ ఆర్థికమంత్రిగా తొలి అవకాశం : 1982
1991 : ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌
1995 : విదేశాంగ మంత్రి
1998 : ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ 
2004 : తొలిసారి లోక్‌సభకు.. రక్షణమంత్రి పదవి
2008 : పద్మవిభూషణ్‌ పురస్కారం
2009 : దేశ ఆర్థికమంత్రిగా రెండోసారి
2012 : 13వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం
2019 : భారతరత్న పురస్కారం
2020 ఆగస్టు 10 : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
2020 ఆగస్టు 13 : మెదడు సర్జరీ తర్వాత కోమాలోకి
2020 ఆగస్టు 31 : 84 ఏళ్ల వయసులో కన్నుమూత