1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (16:11 IST)

కేసీఆర్ చాలా డేంజర్... సోనియాను మోసం చేశారు : బీజేపీలో విజయశాంతి

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి విజయశాంతి ఎట్టకేలకు కాషాయం కండువా కప్పుకున్నారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లి కమలం పెద్దలతో మంతనాలు జరిపిన ఆమె.. సోమవారం ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు. 
 
ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి, తెరాస చీఫ్ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 1998 జనవరిలో బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, ఇన్నేళ్ళ తర్వాత తిరిగి అదే గూటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తన వంతుగా ఎంతో కృషి చేశానని చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి, తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తన పార్టీని తెరాసలో విలీనం చేయమని కేసీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. 
 
కేసీఆర్ కంటే ముందు నుంచే తాను తెలంగాణ కోసం పోరాడుతున్నానని గుర్తుచేశారు. తొలుత టీఆర్ఎస్ నుంచి తాను, కేసీఆర్ ఇద్దరం ఎంపీలుగా గెలిచామన్నారు. 2013 జూలైలో తనను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారని తెలిపారు. తొలి నుంచి కూడా కేసీఆర్ తనపై కుట్ర పూరితంగానే వ్యవహరిస్తూ వచ్చారని ఆరోపించారు. పైగా, తెరాస నుంచి తనకు తానుగా స్వయంగా బయటకు వెళ్లేలా తనపై దుష్ప్రచారం చేయించారని ఆరోపించారు. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేస్తానని సోనియా గాంధీకి చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఆమెను మోసం చేశారని విజయశాంతి మండిపడ్డారు. తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు ఎవరూ ఉండకూడదనే ఆలోచనతో ఇతర పార్టీల నేతలందరినీ టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ చేర్చుకున్నారన్నారు.