శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (19:12 IST)

ఆవేశంలో వాగేశా.. ప్లీజ్ పెద్దది చేయకండి : మా వివాదంపై రాజశేఖర్ (Video)

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఓ వివాదానికి కారణమైన హీరో రాజశేఖర్ సారీ చెప్పారు. ఏ ఒక్క పని జరగకపోవడం వల్లే అలా చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఈ వివాదాన్ని పెద్దది చేయొద్దు అంటూ ప్రాధేయపడ్డాడు. పైగా, అగ్రహీరోలు చిరంజీవి, మోహన్‌బాబు సేవలు తమకు ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. 
 
ఈనెల ఒకటో తేదీన హైదరాబాద్ నగరంలో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ, పరుచూరి గోపాలకృష్ణ, సీనియర్ నరేష్ వంటితో పాటు.. అనేక మంది నటీనటులు పాల్గొన్నారు. 
 
అయితే, మా ఉపాధ్యక్ష హోదాలో ఉన్న హీరో రాజశేఖర్ నానా హంగామా చేశారు. చిరంజీవి, మోహన్ బాబు చేతిలో ఉన్న మైకును లాక్కొని వారిపై విమర్శలు గుప్పించారు. దీంతో సాఫీగా సాగిపోతున్న కార్యక్రమం కాస్త రసాబాసగా మారిపోయింది. ఈ వివాదంపై చిరంజీవితో పాటు.. మోహన్ బాబు మండిపడ్డారు. ఆ తర్వాత రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ తన భర్త చేసిన వివాదానికి వేదికపై నుంచి క్షమాపణలు చెప్పారు. 
 
ఈనేపథ్యంలో రాజశేఖర్ కూడా శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు. గురువారం నాటి గొడవను పెద్దదిగా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు, చిరంజీవికి, మోహన్‌బాబుకి మధ్య ఎలాంటి గొడవలు కానీ, అపోహలు కానీ లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తన వల్ల జరిగిన గొడవకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు రాజశేఖర్ తెలిపారు.
 
తన పదవికి రాజీనామా చేశానని, పరిశ్రమకు తన వంతు సాయం ఏది అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిరంజీవి, మోహన్‌బాబుపై తనకు అమితమైన గౌరవం ఉందని, ‘మా’కు వారి సేవలు అవసరమని అన్నారు. గొడవను తమ ముగ్గురి మధ్య జరిగిన గొడవగా చూడొద్దని కోరారు. 
 
గురువారం ఏం జరిగినా అది తనకు, నరేశ్‌కు, ‘మా’కు మధ్య మాత్రమే జరిగినదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. ఏ ఒక్క పనీ సరిగా జరగకపోవడం వల్ల తాను మాట్లాడకుండా ఉండలేకపోయానని రాజశేఖర్ స్పష్టం చేశారు.