సినీ అమ్మ ముద్దుబిడ్డలు.. 2020 బెస్ట్ ఫోటో ఇదే : మంచు మనోజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కొత్త సంవత్సరం రోజున హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలైన మోహన్ బాబు - చిరంజీవిలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఆలింగన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైర్ అయింది.
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ, తాము ఎప్పుడు కలుసుకున్నా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామే తప్ప తామిద్దరి మధ్య విభేదాల్లేవని చెప్పుకొచ్చారు. దానికి చిరంజీవి ప్రతిస్పందిస్తూ మోహన్ బాబును ఆత్మీయాలింగనం చేసుకుని బుగ్గపై అభిమానంతో ముద్దు పెట్టారు.
దీనికి సంబంధించిన ఫొటోలనే మంచు మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సినీ అమ్మ ముద్దుబిడ్డలు అంటూ పేర్కొన్న మనోజ్, "2020 ఆరంభానికి ఇదే బెస్ట్ ఫొటో" అంటూ వ్యాఖ్యానించారు.