శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (13:52 IST)

దర్శక ధీరుడి భార్యను కాకాపడుతున్న కాజల్

కాజల్ అగర్వాల్. "చందమామ" చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. గత దశాబ్దన్నరకాలంలో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించింది. అనేక చిత్రాల్లో నటించింది. అయితే, కుర్రకారు హీరోయిన్ల దెబ్బకు ఈ అమ్మడి హవా కాస్త తగ్గిపోయింది. అయినప్పటికీ.. కుర్రకారు హీరోయిన్లతో పోటీపడుతోంది. అందాలు ఆరబోసేందుకు సై అంటోంది. 
 
అయితే, గత రెండేళ్లుగా ఆమె ఖాతాలో చెప్పుకోదగిన విజయాలేవీ లేవు. అయినప్పటికీ ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ "ఇండియన్ 2", జాన్ అబ్రహాం 'ముంబయి సగలో', మంచు విష్ణు 'మోసగాళ్లు' సినిమాల్లో కాజల్ నటిస్తోంది. ఈ సినిమాల షూటింగ్‌లన్నీ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేసింది కాజల్. అందులో దర్శకధీరుడు రాజమౌళి భార్యతో ఆమె సెల్ఫీలు తీసుకుంది. ఇక దీనిపై ట్వీట్ పెడుతూ.. "ఫ్లైట్‌లో నాకు ఇష్టమైన వ్యక్తులు కలవడాన్ని ఇష్టపడుతుంటా. మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తుంటామో ఆ వ్యక్తులే తెలీకుండా మన పక్క సీట్లో కూర్చుంటే మన ఆనందాన్ని వివరించలేము. రమా మేడమ్‌తో ఎప్పుడు మాట్లాడినా అదొక గొప్ప అనుభూతి" అంటూ ట్వీట్ చేసింది. 
 
సాధారణంగా కాజల్ అగర్వాల్ మనస్తత్వాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఆమె సినిమాల్లో నటించడం మినహా పెద్దగా కలవరు. అంటే అంత ర్యాపోను కొనసాగించరు. అలాంటి కాజల్.. రమా రాజమౌళితో ప్రత్యేకంగా ఫొటో తీసి పెట్టడంతో దర్శకుడి భార్యను కాజల్ కాకా పడుతోంది అన్న టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. 
 
నిజానికి దర్శకుడు రాజమౌళి ఒక్క అనుష్కను మినహా మరే ఇతర హీరోయిన్‌ను తన సినిమాల్లో రిపీట్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో కాజల్ ఎందుకు కాకాపడుతుందోనన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.