గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

ముగిసిన జూబ్లీహిల్స్ ఉప పోరు... ఓటరన్న తీర్పుపై ఉత్కంఠ

vote
హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటరు దేవుళ్ళు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైవుంది. అయితే, ఈ స్థానం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తక్కువ పోలింగ్‌ శాతం తమకే అనుకూలమని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారాస విశ్లేషిస్తున్నాయి. 
 
మరోవైపు, సర్వేలన్నీ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నా.. సిట్టింగ్‌ స్థానం తమకే దక్కుతుందని భారాస విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ను బట్టి కాంగ్రెస్‌ 6 నుంచి 9 శాతం వరకు ఆధిక్యం వస్తుందని అంచనాలు వేస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజేతకు సుమారు 50 శాతం అంటే 97వేల ఓట్లు రావాల్సి ఉంది. భాజపాకు పడే ఓట్లను బట్టి ఇవి ఆధారపడి ఉంటాయి. భాజపా ఎక్కువ ఓట్లను చీల్చగలిగితే.. తక్కువ ఓట్లు వచ్చినా విజేతగా నిలుస్తారు. 
 
స్వతహాగా జూబ్లీహిల్స్‌ భారాస సిట్టింగ్‌ స్థానం. ఉప ఎన్నికల్లో సానుభూతి కూడా తోడైంది. అయితే ప్రతిపక్షంలో ఉండటమే భారాస బలహీనం. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం బలంగా మారిందని చెబుతున్నారు. సీఎం రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేకంగా రోజూ సమీక్షించారు. ప్రధానంగా డివిజనుకు ఇద్దరేసి మంత్రులను ఇన్‌ఛార్జులుగా నియమించడం, ప్రతి 10 పోలింగ్‌ కేంద్రాలకు ఎమ్మెల్యేను నియమించారు.
 
అయితే పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన సర్వేల అంచనాల మేరకు.. భారాసకు అనుకూలంగా ఉంటే.. కాంగ్రెస్‌ అధిక్యానికి పార్టీ వ్యూహాలు పన్నినట్టు చెబుతున్నారు. పోలింగ్‌ శాతం పెరిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారేదన్న విశ్లేషణ చేస్తున్నారు. తక్కువ కావడం కూడా తమకే అనుకూలమని కాంగ్రెస్‌ నేతలు గట్టిగా చెబుతున్నారు.