తెలంగాణను వణికిస్తున్న చలి.. ఆరెంజ్ అలెర్ట్.. ఆరోగ్యం జాగ్రత్త
తెలంగాణను చలి వణికిస్తోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. తద్వారా చలి తీవ్రతకు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో సిర్పూర్ (కుమురం భీమ్) వద్ద 10.2°C అత్యల్ప అధికారిక కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో, నవంబర్ 13-18 మధ్య నగరంలోని పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో 11°C, 13°C మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ చల్లటి వాతావరణానికి గురికాకుండా ఉండాలని, చలిని ఎదుర్కునే దుస్తులు ధరించాలని అధికారులు సూచించారు. రబీ పంటలు, పశువులను చలి ఒత్తిడి నుండి రక్షించాలని రైతులను కోరారు. ఐఎండీ ప్రకారం, ఈ చలి ప్రభావం నవంబర్ 17 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి.
ఈ చలి కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కునే అవకాశం వుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లని వాతావరణంలో రోగ నిరోధక శక్తి మందగించడం వల్ల వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయని, దీనివల్ల న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొన్ని వర్గాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.