సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:21 IST)

కాళరాత్రి కథకు పోలీసులు ఫుల్‌స్టాఫ్ పెట్టారు : ఎన్‌కౌంటర్‌పై పోలీసులు

గత నెల 27వ తేదీన జరిగిన కాళరాత్రి కథకు హైదరాబాద్ నగర పోలీసులు ఫుల్‌స్టాఫ్ పెట్టారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పశువైద్యురాలు దిశ అత్యాచార, హత్య కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం వేకువజామున ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెల్సిందే. నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ ఓ ప్రకటన చేశారు. 
 
'దిశ' ఉదంతం కనువిప్పు కావాలని, బహిరంగ శిక్షలు అమలు చేయాలని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కాళరాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని పవన్ భావోద్వేగ ప్రకటన చేశారు. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే అని ఆయన చెప్పారు.
 
దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదని, మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదని జనసేనాని అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించిందని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.