మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రముఖ నటి అంజలి.. చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ట్రైలర్ చాలా బాగుంది. మీ పాత్ర మాస్‌గా, కొత్తగా ఉంది?
థాంక్యూ అండీ. ఈ పాత్ర చేయడం నాక్కూడా కొత్తగా ఉంది. ఇలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.
ఈ సినిమాలో మీరు రత్నమాల పాత్ర చేయడానికి అంగీకరించడానికి ప్రధాన కారణం ఏంటి?
పాత్రను మలిచిన తీరు చాలా బాగుంటుంది. కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించడం నాకు నచ్చదు. ఈ పాత్రలోని వైవిధ్యమే నన్ను ఈ సినిమా చేయడానికి అంగీకరించేలా చేసింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్రతో మీ బంధం ఎలా ఉండబోతుంది?
మా పాత్రల బంధం స్వీట్‌గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. నా ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. రత్నమాల నా సినీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది.
రత్నమాల పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు?
ఈ తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్‌గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.
విశ్వక్ సేన్, మీరు పోటీపడి నటించారా?
నిజంగానే మా పాత్రలు పోటాపోటీగానే అనిపిస్తాయి. సినిమాలో విశ్వక్ ఎంత గట్టిగా మాట్లాడతారో.. అంతకంటే గట్టిగా నేను మాట్లాడతాను. ట్రైలర్‌లో గమనిస్తే మీకు ఆ విషయం అర్థమైపోతుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లేదా ఫలానా పాత్ర అని కాకుండా.. అన్ని పాత్రలు బలంగా, కథలో కీలకంగా ఉంటాయి.
కథానాయికగా కాకుండా మీరు ఈమధ్య ఎక్కువగా కీలక పాత్రలలో నటించడానికి కారణం?
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర. 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అనేది నా సినిమా, నేను ప్రధాన పాత్ర పోషించిన సినిమా. అలాగే 'గేమ్ చేంజర్' చిత్రంలో కూడా నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర.
రామ్ చరణ్ గారితో 'గేమ్ చేంజర్' చేయడం ఎలా ఉంది?
రామ్ చరణ్ గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. పాత్ర కోసం నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి పరితపిస్తారు. ఆయన తన పాత్ర విషయంలోనే కాకుండా.. సినిమాలోని ఇతర పాత్రధారులకు కూడా అంతే సహకారం అందిస్తారు.
విశ్వక్ సేన్ గురించి?
విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్‌లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.
మీరు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఫైనల్ కాపీ చూశారా? ఎలా అనిపించింది?
ఇది అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
దర్శకుడు కృష్ణ చైతన్య గురించి?
మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.
నిర్మాతల గురించి చెప్పండి?
వరుస విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సితార లాంటి సంస్థలో పని చేయడం సంతోషంగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. అలాంటి నిర్మాణ సంస్థ తోడు కావడం వల్లే.. ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది.
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి?
యువన్ సంగీతంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ సినిమాలో సంగీతం కొత్తగా ఉంటుంది. పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది.
పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు?
ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే.
తదుపరి చిత్రాల గురించి?
తెలుగులో 'గేమ్ చేంజర్'తో పాటు మరో సినిమా అంగీకరించాను. తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.